ArticlesNews

సంపూర్ణ హిందూ సమాజంలో సమరస భావ వికాసమే బోయి భీమన్న కవి స్వప్నం

142views

తోటివారి హృదయాల్ని మేలుకొలిపి, వారిలో ఆత్మగౌరవ ఆకాంక్షను రగిలించిన పద్మభూషణుడు బోయి భీమన్నకవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళా ప్రపూర్ణుడాయన. పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత వంటి పలు సాహితీ ప్రక్రియల్లో 70కి పైగా రచనలను వెలువరించిన భీమన్న భావం సున్నితం! భాష సుందరం! ఆశయం అద్భుతం!

“బానిసతనమును బాపుమురా… భారతభూమికి భాగ్యము తేరా! సకల దేశముల సర్వ మానవుల సామ్యము సాధింపుమురా!!” అంటూ తన రచనలతో అణగారిన సమాజాన్ని ప్రేరేపించిన సమరసతా సాహిత్య సిద్ధాంతకర్త బోయి భీమన్న. పేదరికం, అంటరానితనం, అవమానాల స్వానుభవాలతో అక్షరాలే ఆయుధంగా అనుక్షణం ఉద్యమించిన ఈ సాహితీవేత్త సెప్టెంబరు 19, 1911న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు ఆయన స్వస్థలం. తండ్రి పుల్లయ్య, తల్లి నాగమ్మ. తండ్రి అయిదుగురు కొడుకులకు పంచపాండవుల పేర్లు పెట్టుకున్న క్రమంలో రెండో కుమారుడే ‘భీమన్న’ అయ్యారు! విద్యాభ్యాసం పూర్తయిన తొలిరోజుల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారాయన. ఆ తర్వాత జనవాణి, జయభేరి, ప్రజామిత్ర, నవజీవన్, ఆంధ్రప్రభ పత్రికల్లో పనిచేశారు.

విద్యతోనే వికృతులను రూపుమాపగలం :

అంబేడ్కర్ వ్రాసిన ‘ఎనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్’ గ్రంథాన్ని ‘కుల నిర్మూలన’ పేరుతో తెలుగులోకి అనువదించారు. అంతే త్రికరణశుద్ధితో అంబేడ్కర్ సిద్ధాంతవాదాన్ని అనుసరించి, ప్రచారం చేశారు. అంబేద్కర్, భీమన్న ఇరువురూ
చదువుకోవటంవల్లనే సమాజానికి ఆదర్శం కాగలిగారు. అందుకేనేమో పాలేర్లు, రైతుకూలీలు తమబిడ్డలను చదివించాలని, తద్వారా వారి అభివృద్ధికి బాటలు వేయాలని ‘పాలేరు’ నాటకంలో ఉద్బోధించారు బోయి భీమన్న. అందులో ఒక పద్యం ఇలా ఉంది.

గోచిపెట్టుట నేర్చుకొనగానే బిడ్డకు చేతికి కర్రిచ్చు రైతులార!
నడవ నేర్చిన తోనె బుడతను గొంపోయి
పాలేరు దనముంచు మాలలార!
పసిబిడ్డ తెచ్చు సంపాదన కాశించి
మనుగడలే మాపు జనకులార!
వంట యిల్లే ప్రపంచమ్ముగా చేసి
తనయల మెడకోయు తల్లులార!
జాతి శక్తివిహీనమై చచ్చుచుండ
కనులను మూసి కొంటిరే గాఢనిద్ర
శక్తికంతకు మూలము చదువుకాన
చదువ బంపుడు మీ తనూజాళినింక

‘జనం వైజ్ఞానికంగా ఎదగటానికి నిరంతరం కృషి చేసేవాడే కవి’ అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. అందుకే సమాజానికి మంచి విషయాన్ని పదే పదే ఉద్బోధించాలని అయన చెప్పేవారు.

“ప్రతిరోజూ సుప్రభాతం పాడితేనేకాని
దేవుడికే మెలకువరాని ఈ దేశంలో
ఎంతటి ప్రసిద్ధ సత్యం కానీ ఎవరో
అనుక్షణం జ్ఞాపకం చేస్తూనే ఉండాలి మనిషికి”

అంటారు ‘గుడిసెలు కాలిపోతున్నాయ్’ గ్రంథంలో

కులాంతర వివాహాలతో కుల పంకిలాన్ని కడిగెయ్యొచ్చు :

అంబేద్కర్, భీమన్నలిద్దరూ యాదృచ్ఛికంగా కులాంతర వివాహమే చేసుకున్నారు. తాము చెప్పిన వాటిని జీవితాంతం ఆచరించి చూపి మహానుభావులయ్యారు. “వ్యక్తుల వికాసమే జాతి. జాతుల వికాసమే వసుధ. వసుధైక సామ్రాజ్యమే మానవలోక సంపూర్ణ ఫలం” అన్నది భీమన్న తాత్విక భూమిక.”కవి ఏ కాలంలో జీవించాడో, ఆ కాలానికి చెందిన సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలన్నీ అతడి రచనల్లో ప్రతిఫలించాలని చెప్పిన బోయి భీమన్న కవిత్వం తెలుగు సంస్కృతికి అద్దంపడుతుంది. సాహిత్యంలో భీమన్న సృష్టించిన ఒరవడి అద్వితీయం, అజరామరం.

భీమన్న వ్రాసిన ‘పాలేరు’ నాటకంలో వెంకన్న, వనబాలల ప్రేమకథలోనూ, 1959లో వ్రాసిన ‘రాగవాసిష్ఠం’ నాటకంలో గల అరుంధతి, వశిష్ఠుల ప్రణయ గాథలోనూ, మరికొన్ని రచనల్లోనూ కులాంతర వివాహాల పేరుతో కులనిర్మూలన అవకాశాల్ని చర్చించాడు. సమాజంలో కులం వల్ల గౌరవం పొందుతున్న కుటుంబం నుండి వచ్చిన వనబాల, కులం వల్ల సమాజంలో అవమానాలకు గురౌతున్న వెంకన్న పరస్పరం ప్రేమించుకుంటారు.

పాలేరుగా పనిచేయాల్సిన వాడు, అగ్రకులంగా గౌరవమర్యాదల్ని పొందుతున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటే, ఎన్ని బాధలకు గురికావాల్సివస్తుందో, అన్నింటినీ అగ్రకుల, భూస్వామి కుబేరయ్య వల్ల పాలేరు వెంకన్న ఎదుర్కొంటాడు. చివరికి ‘ఉపకారి’ మాస్టారు సహాయంతో చదువుకుని, వెంకటేశ్వరరావుగా గౌరవం పొంది, డిప్యూటీ కలెక్టరుగా ఉన్నతోద్యోగం సాధిస్తాడు. ఉద్యోగిగా తన గ్రామానికే వచ్చి, భూస్వాముల దురాగతాలను చట్టబద్ధంగా అడ్డుకుంటాడు. అస్పృశ్యతను పాటించే వాళ్ళనీ, ప్రోత్సహించేవాళ్ళనీ నిరోధిస్తాడు. ప్రజాస్యామ్యబద్ధంగా దళితులు తమ హక్కుల్ని సాధించుకోవాలనే అంబేడ్కర్‌ ఆశయాన్ని దీని ద్వారా ప్రేరేపించాడు భీమన్న. అంతేకాదు… చదువు యొక్క ప్రాముఖ్యతను, చదువు వల్ల లభించే గౌరవాన్ని, తద్వారా ఒనగూరే ప్రయోజనాన్ని గూర్చి స్పష్టంగా వివరించారు భీమన్న కవి.

భార్యా పిల్లలతో బోయి భీమన్న కవి

ద్వేషంతో కాదు ప్రేమతోనే సమరసత సాధించగలం :

“ఆయన రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న విషయం ఒక్కటే అదే భారతజాతి ఏకత్వం”. సమాజంలో చెడ్డవాళ్ళే కాదు, అనేకులు మంచివారు కూడా ఉంటారని తెలియజేయటం భీమన్న సాహిత్యంలోని విశిష్ట గుణం. పాలేరు నాటకంలో వనబాల, అగ్రవర్ణానికి చెందిన కుటుంబంలో నుండి వచ్చినదైనప్పటికీ, అలాంటి వాళ్ళలోనూ సంకుచిత మనస్తత్వం, కులతత్వం లేనివాళ్ళుంటారనే విషయాన్ని తెలియజేశారు. హరిజనులుగా సమాజంచే పిలువబడ్డవారి అంతరంగాలలో స్వాభిమానాన్ని నింపి, సమకాలీన సమాజంలో గౌరవానికి అర్హులయ్యేటట్లుగా చేయటం భీమన్న గారి సాహిత్య లక్ష్యం. పాలేరు, కూలిరాజు వంటి నాటకాలలోనూ, ‘జన్మాంతర వైరం,’ ‘అంబేడ్కర్ సుప్రభాతం ,’ ‘అంబేడ్కరిజం,’ ‘పంచమ స్వరం’ మొదలైన కావ్యాలలోనూ ఈ తపన స్పష్టంగా గోచరిస్తుంది.

భీమన్న రచనలపై అనేకమంది పరిశోధనలు చేశారు.శ్రీమతి హైమావతి గారు చక్కని కథనాత్మక శైలిలో వ్రాసిన పరిశోధనాత్మక గ్రంథం ‘‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయిభీమన్న’’. ఇది వీరి సాహిత్య దృక్పథాన్ని తెలిపే చుక్కానిలాంటిది. దానిలోని సూచనల్ని గమనిస్తే, ఆయన వ్రాసిన రచనల్లో పరిశోధకులకు, విమర్శకులకు తమదైన విశ్లేషణకు ప్రేరణ దొరుకుతుంది.

భారతదేశంలోని ‘వైవిధ్యంలో ఏకత్వం’ లాగే, భీమన్న రచనల్లోనూ వైవిధ్యం కనిపిస్తుందనీ, ఆయన కుల, మతాల కంటే మానవత్వాన్నే ఆశించిన ‘జాతీయవాది’ అనీ ఆ గ్రంథం ప్రతిపాదిస్తుంది. భారత జాతీయ దృక్పథంలో అంతర్భాగంగా ప్రవహించే హిందూమతంలో కులాన్ని ప్రత్యేకంగా విశ్లేషించుకోవాలి. అంబేడ్కర్‌ విశ్లేషించిందీ, భీమన్న వ్రాసిందీ అదే! తన జీవితాంతం ఆయన జాతీయవాదిగానే ఉన్నాడు. జాతీయతలో తాను పుట్టి పెరిగిన దేశీయ వాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే, ఆత్మగౌరవంతో జీవించాలనే ఆకాంక్ష ఆయన రచనలలో, మాటలలో, వ్యవహారంలో ప్రతిఫలిస్తుంది.

వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు మొదలైన వాళ్ళు దళితులేనని వాదిస్తూ, వాళ్ళు వ్రాసిన భారత, రామాయణ, భాగవతాలు తమవేనని చెప్పడంలో భీమన్న దృక్పథాన్ని లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

వర్గపోరాటాలు జరుగుతున్న తీరుని విమర్శిస్తూ ‘నాయకులంతా దేశీయ స్థితిగతులను గుర్తించకుండా ప్రపంచ కార్మిక దృష్టిమాత్రమే కలిగిన ధనిక సవర్ణులు’ అని ప్రకటించారు.

నేను హిందువుని, ఈ జాతీ, దేశమూ నావి. మతం మారాల్సిన అవసరమేముంది? :

మతమార్పిడులపై కూడా ఆయన చాలా దృఢంగా, బలంగా స్పందించారు. 1980లో వెలువడిన ‘జన్మాంతర వైరం’ గ్రంథంలో వారు చర్చించిన ఈ విషయాలు గమనించ దగ్గవి.

“నేను హిందువుగా పుట్టాను, మతం మార్చవలసిన అవసరంలేదు. పెనంలో నుండి పొయ్యిలోకి దూకటం దేనికి?

ఈ హిందూమత మూలపురుషులు, ఈ భారత సంస్కృతి మూలఋషులు నావాళ్ళు, నా హరిజనులు అని నేను విశ్వసిస్తున్నప్పుడు, నా వారసత్వపు హక్కుల్ని ఏదో విధంగా తిరిగి సంపాదిస్తానే గానీ పారిపోవడమనేది ఎందుకుంటుంది? మెజారిటీ జనం వాణ్ణి మైనారిటీగా ఎందుకు మారతాను?

కాగా, నేను హిందువుణ్ణి. ఈ జాతీ, ఈ దేశమూ నావి. పోనీ నేనొక్కడ్డీ మరో మతంలోకి పారిపోతాననుకోండి. నాతో కొంతమందిని తీసుకుపోతాననుకోండి. ఎంతమందిని తీసుకు పోగలను? లక్షా, రెండులక్షలా? వాళ్లయినా, నామీద గౌరవంతో వస్తారు. అవతలి మతంలో విశ్వాసంతో కాదు గదా?

ఔరంగజేబులాంటి ముస్లిం నిరంకుశ చక్రవర్తులు, బ్రిటిషర్లలాంటి సర్వశక్తిమంతులైన క్రైస్తవ పాలకులు – తమ అధీనంలోని చతురుపాయాలనూ ప్రయోగించి కూడా ఎంతమంది మావారిని (మాలలను, మాదిగలను) తమతమ మతాలలోకి ఆకర్షించగలిగారు?

గొంతెమ్మ, బతకమ్మ, మైసమ్మ పండుగలకు, బోనాలకు, గ్రామదేవతలకు, పసుపు కుంకుమతో దైవత్వం కల్పించబడ్డ రాళ్లకూ, చెట్లకూ, గదులలోని గోడలకూ ఆత్మార్పణ చేసుకునే ఈ నాకులం పదిహేనుకోట్ల మంది మాదిగలను నాతో తీసుకుపోగలనా?

నా స్వార్థంకోసం, నా ప్రతిష్ఠకోసం నేను పారిపోకూడదు. గుడిసెలలో, దరిద్రంలో, కూలీలుగా బ్రతుకుతూ కూడా బోనాల పండుగలు చేసుకుంటూ, భోగులుగా జీవిస్తున్న ఈ నా పదిహేను కోట్ల మందినీ వదిలేసి నేను పారిపోకూడదు. నేను పారిపోతే నాకూడా వీళ్లు రారు, రాలేరు. పూర్వకాలాలలో వచ్చారు కనుకనా? పారిపోక మరేంచెయ్యాలి?’

నేనే కనుక సిసలైన మనిషినైతే, నేనే కనుక నిజాయితీ కల మాల మాదిగవాణ్ణయితే, నేనే కనుక ధర్మవ్యాధ, మాతంగ, వాల్మీకి, వ్యాస మహాపురుషుల వారసుణ్ణయితే, నేనే కనుక నా కులాన్ని దాస్యంనుంచి విమోచన కలిగించడం అనే ధర్మానికి కట్టుబడిన వాణ్ణయితే, నేను కనుక ఆర్ష భారతజాతి సమగ్ర సంఘటిత శ్రేయస్సును కోరినవాణ్ణయితే నేను నా సమస్త పదవీ విద్యాప్రతిష్ఠా గర్వాలనన్నింటినీ పీకిపారేసి, ఈ నా గ్రామీణ హరిజన గుడిసెవాసులతో వుండిపోవాలి.

వాళ్లతోనే ఉంటూ వాళ్ల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ, ఒక్కొక్క అడుగే వాళ్లను ముందుకు నడిపించాలి. తరతరాల దాస్యంతో, దారిద్య్రంతో సగం చచ్చిపోయి వున్నవాళ్లను మానసికంగా ఓదార్చాలి. బ్రెయిన్వాష్ చేయబడిన వారి మెదళ్లకు తిరిగి స్వాస్థ్యం కలిగించాలి. పూర్వౌన్నత్యాన్ని చూపి వాళ్లను పునశ్చేతనుల్ని చేయాలి. ఇప్పుడిదంతా నాకు భౌతికంగా సాధ్యం కాకపోవచ్చు. కర్తవ్యబోధ చేస్తే ఏ ఒక్క యువకుడైనా కంకణధారి కావచ్చు. ఏ కులానికాకులం కులసంఘాలు పెట్టుకుంటూ వైరి వర్గాలుగా విడిపోతూ సెగ్రగేట్ ఐపోతున్న ఈనాటి రాజకీయ పదవీ రాక్షస యుగంలో కులాంతరీకరణను బోధిస్తున్నాను ఎందుకు? హరిజన యువకులేకాదు, ఏ కులం యువకులైనా సరే వివేకంతో, యథార్థాన్ని గుర్తించి భారత సమాజ పునర్నిర్మాణం కోసం ముందుకు వస్తారన్న ఆశతో……..”

నిజమైన సమరసతా వాది :

‘జన్మాంతరవైరం’ కావ్యం చివరిలో గుడిగంటలు ద్వారా డా॥బోయి భీమన్న ధ్వనింపజేసిన సందేశమిలా ఉంది….

“లే దస్పృశ్యత, లేదు లేమి, కులముల్ లేవు, ఆర్షలోకమ్ము తత్
భేదక్లేశము లెల్లతీరి, ధ్వజమెత్తెన్ లోక శ్రేయస్సుకై
వేదోక్తమ్మిది సర్వజాతి సమతావిష్కార తత్త్వమ్ము బ్రా
హ్మీదేవత్వము నొంది సాగుడొకటై, మేధావులై ఎల్లరున్”
అనుచు వినిపించె మ్రోల శివాలయమున
ఠంగు మనుచున్న రుద్ధ ఘంటా స్వరాలు
సర్వమానవ సమ సమాజవ్యవస్థ
నవని కిడ బైలుదేరు డన్నట్టి పిలుపు.

పై రచనలో… భీమన్న కులం లేదన్నారని పేర్కొంటూ వివిధ సాహితీ సదస్సుల్లో భీమన్న సాహిత్యాన్ని విమర్శిస్తున్నవారున్నారు.ఆయన భారతదేశంలో కుల నిర్మూలనను మనసా వాచా ఆకాంక్షించారన్నది సుస్పష్టం. కొందరు తమ సంకుచిత, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కుల వివక్ష పేరిట బాధిత ప్రజలను రెచ్చగొట్టడాన్ని, కుల వైషమ్యాలను మరింతగా రెచ్చగొట్టటాన్ని, కులం పేరిట కొట్టుకు చావటాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. వర్ణాంతర వివాహాల వల్ల కులనిర్మూన జరగడాన్ని ఆకాంక్షించారు. బాధిత వర్గాలు చదువుకోవలసిన అవసరాన్ని పదే పదే నొక్కి వక్కాణించారు. కులాల మధ్య వైరి భావాన్ని కాక, సోదర భావాన్ని సదా ఆకాంక్షించారు. తన వారు, వేరే వారని కాక సమాజం మొత్తాన్నీ సమదృష్టితో దర్శించారు. సమాజంలో సమరస భావం వికసించాలని సదా కాంక్షించారు. తన ఆరోగ్యం బాగులేక పోయినా బోయి భీమన్న గారు 94 వ ఏట హైదరాబాద్ లో జరిగిన సామాజిక సమరసత సభలో పాల్గొని ప్రసంగించారు.సామాజిక సమరసతా కార్యానికి తమ మద్దతును తెలిపారు.

చాలా విషయాల్లో ఆయనది అనితర సాధ్యమైన రికార్డు. బాల్యంలో పన్నెండేళ్ళ వయస్సులోనే మృదు మధురమైన పద్యకవిత వ్రాశారు. శతాధిక గ్రంథాలను రచించి ప్రచురించారు. కాశీ, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యా లయాలనుండి కళాప్రపూర్ణ గౌరవాన్ని, గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. “గుడిసెలు కాలిపోతున్నాయ్” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. భారతప్రభుత్వం నుండి పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన 95 సంవత్సరాలు జీవించారు. 95 సంవత్సరాలు జీవించటంకాదు విశేషం, చివరిరోజుల వరకు కవిత్వం చెబుతూనే ఉన్నారు. గ్రంథాలు వెలువరిస్తునే ఉన్నారు. ఆయన వ్రాసిన చివరి గ్రంథం “శ్రీశ్రీ కమ్యూనిస్టు కాడు” అన్న గ్రంథం. అది ఆయన మరణానంతరం వెలువడింది.

2005 డిసెంబరు 16న తన 95వ ఏట తనువు చాలించిన శ్రీ బోయి భీమన్న చిరస్మరణీయుడు. సదా అనుసరణీయుడు.

* నేడు ఆ మహా కవి జయంతి.

– శ్రీరాంసాగర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.