ArticlesNews

నదీ ప్రవాహాలతో ఆటలాడుకుంటూ ప్రజలకు ప్రాణ ప్రదాత అయిన ‘భారతరత్న’ డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

150views

న్నపళాన ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు ఉరిమాయి. మెరుపులు మెరిశాయి. జల్లుగా ప్రారంభమైన వర్షం ఉద్ధృతమై నింగీ నేలను కలిపేసింది. నీరు కాలువలై ప్రవహించింది. చెట్ల కొమ్మలు, రాళ్లు ప్రవాహంలో కొట్టుకు పోసాగాయి. ఇవన్నీ పరిశీలిస్తూ వరండాలో నిలుచున్న ఆరేళ్ల బాలుడు ఆశ్చర్యపోయాడు. నిమిషాల మీద ప్రకృతిలో వచ్చిన మార్పులు గమనించి, సూర్యునికి, గాలికి, నీటికి ఎంత శక్తి ఉందోనని అబ్బురపడ్డాడు. ఎలా అయినా సరే తను ప్రకృతి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఆ పిల్లవాడే భవిష్యత్తులో దేశ దారిద్ర్యాన్ని పారద్రోలడానికి, నదీనదాలను లొంగ దీసుకొని ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు.

1908లో హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి . అపార జన నష్టం, ఆస్థి నష్టం జరిగింది. అందుకు కారణం నగర నడిబొడ్డులో ప్రవహించే మూసీ నది. అదే సమయంలో ముంబై నుండి హైదరాబాద్ వచ్చిన ఒక చీఫ్ ఇంజనీర్ ఇదంతా గమనించి మూసీ నదికి ముకుతాడు వేశాడు.ఇంతకూ ఆయన చేసిందేమిటి? మూసీ నదికి వరదలు రాకుండా డ్యాం కట్టించినారు. నాటి నుండి నేటి వరకు ఏ విధమైన నష్టమూ లేదు. ఒక్క మూసీనదికే కాదు దేశంలోని అనేక నదులకు డ్యాములు కట్టించినారు. అంతేకాక నదీతీరాల వెంట సుందరమైన ఉద్యానవనాలను పెంచవచ్చు అనే సూచన అందించారు. ఒక పనిని చేపట్టిన తర్వాత కష్ట నష్టాలను  భయభీతులను లెక్కించ క పట్టుదలతో దానిని పూర్తి చేయటం ఆ ఇంజనీరు స్వభావం.

అమెరికాలో ఒక కర్మాగారాన్ని పరిశీలించడానికి మన దేశం నుంచి కొంతమంది ఇంజనీర్లు వెళ్లారు .  వీరికి స్వాగతం పలికిన అమెరికా ఇంజనీరు “ఇచ్చటి ప్రధాన యంత్రాన్ని పరిశీలించాలంటే నాలుగంతస్తుల పైకప్పు ఎక్కాల్సిందే”నని వేలాడే నిచ్చెనను చూపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న 85 ఏళ్ల  వృద్ధుడు, ముందూ వెనకా ఆలోచించకుండా నిర్భయంగా నిచ్చెన ఎక్కి యంత్రాన్ని పరిశీలించాడు. ఆయనే మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని కోలారు జిల్లా చిక్ బళ్ళాపూర్ తాలూకా మద్దెనహళ్ళిలో శ్రీనివాస శాస్త్రి, వెంకాచ్చమ్మ దంపతులకు జన్మించారు. వీరి పూర్వులు మన ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు సమీపంలోని ‘మోక్షగుండం’ గ్రామానికి చెందినవారు.

విశ్వేశ్వరయ్య తండ్రి వైద్యుడు. సాంప్రదాయ కుటుంబం. పురాణగాథల చర్చ ఇంట్లో ఎప్పుడూ ఉండేది. ఆ రోజుల్లో ఆంగ్లేయుల పరిపాలనలో పాఠశాలల్లో ప్రార్థనలు రాజవంశాన్ని పొగిడేవిగా ఉండేవి. అది విశ్వేశ్వరయ్యకు నచ్చేది కాదు. పైగా జాతీయ భావన, దేశభక్తి పెల్లుబికి వచ్చేవి.

విశ్వేశ్వరయ్యకు బాల్యంలోనే ఎదురు దెబ్బ తగిలింది. విశ్వేశ్వరయ్య తన 14వ ఏట తండ్రిని కోల్పోయాడు. తల్లి అసహాయురాలు. స్థిర చరాస్థులు ఏవీ లేకపోవడంతో కటిక పేదరికం అనుభవించవలసి వచ్చింది. దాంతో ట్యూషన్లు చెప్పుకుంటూ డబ్బు సంపాదించి చదువు ముందుకు సాగించవలసి వచ్చింది. క్రమశిక్షణ ఆయన జీవన మంత్రం. ఆయన జీవించిన నూట ఒక్క సంవత్సరాలు అత్యంత క్రమశిక్షణతో జీవించారు. పేదరికం కారణంగా వివిధ రకాల పనుల కోసం బెంగుళూరు నగరమంతా కాలినడకన తిరిగేవారు. నేను 101 సంవత్సరాలు బ్రతకడానికి నడకే నా ఆరోగ్య రహస్యం అంటారాయన.

1881లో బిఏలో అగ్ర స్థానాన్ని పొంది ప్రభుత్వ సహాయంతో పూనాలోని సైన్స్ కళాశాలలో ఎల్. సి. ఈ మరియు ఎఫ్. సి. ఈ ప్రధమ స్థానంలో ఉత్తీర్ణుడై నాసిక్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం పొందాడు.

వ్యవసాయాధారిత దేశంలో నీటి సక్రమ వినియోగం కోసం బ్లాక్ సిస్టం (నీటిని నిల్వ చేసే పద్ధతి)ని ప్రవేశపెట్టి, అందుకుగాను ఆటోమేటిక్ వరద గేట్లు తయారు చేయించారు. తొలిసారిగా వీటిని 1903లో పూణే సమీపంలోని ‘ఖడక్ వాస్లా’  వద్ద నిర్మించగా విజయవంతం అయింది. దానికి స్టీలు తలుపులు తయారు చేయించారు. దానిని బ్రిటిష్ ప్రభుత్వం కూడా ప్రశంసించింది.

కొల్లాపూర్ సరస్సు దెబ్బతిని పట్టణానికి ప్రమాదకర స్థితి వచ్చినప్పుడు ఒక పథకాన్ని రూపొందించి ఆ పట్టణాన్ని రక్షించాడు. మైసూర్ రాజ్యానికి చీఫ్ ఇంజనీర్ గా నియమింపబడిన వీరు, నేడు బృందావన్ గార్డెన్స్ లో కనిపిస్తున్న కృష్ణా సాగర్ డ్యాం సృష్టికర్త.

50 చదరపు మైళ్ల విస్తీర్ణంతో సరోవరాన్ని సృష్టించి సిమెంట్ కన్నా మన్నికైన సున్నపు మిశ్రమంతో డ్యాంను నిర్మించారు. మాండ్యా జిల్లాలో 20 వేల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు విద్యుచ్చక్తి అందించిన ఆ డ్యాం నిర్మాణం ఆయన మేధో శక్తికి మచ్చుతునక.

మన దేశానికి అత్యంత విలువైన భద్రావతి ఇనుము – ఉక్కు కర్మాగారం, మైసూరు గంధపు తైల కర్మాగారం, మైసూరు విశ్వవిద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజీ, వంటి సంస్థలను విశ్వేశ్వరయ్య గారు ఈ దేశానికి కానుకలుగా సమర్పించారు.

మనం బానిసత్వంలో మగ్గుతున్న రోజుల్లో సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసి అద్భుతాలు సృష్టించి ప్రవాహాల గతులను మారుస్తూ, అవసరమైన చోట్ల అడ్డుకట్టలు వేసి నదీ ప్రవాహాలతో ఆటలు ఆడుకుంటూ ప్రజలకు ప్రాణ ప్రదాత అయిన అపర భగీరధుడు మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

ఒకసారి విచిత్రమైన సంఘటన జరిగింది మైసూర్ మహారాజు గారు ఆహ్వానం పంపారు అంటే ఆజ్ఞాపించారు అని అర్థం చేసుకోవాల్సిన రోజులు. ఆ రోజుల్లో విశ్వేశ్వరయ్య మైసూర్ మహారాజు ఆహ్వానాన్ని తిరస్కరించారు. కారణం రాజదర్బార్ లో ఆంగ్లేయులకు అయితే కుర్చీలు, ఉచితాసనాలు ఉండేవి. భారతీయులు ఎంతటి వారైనా నేల మీద కూర్చోవాల్సిందే. స్వదేశీయులను ఆగౌరవ పరిచే ఈ విధానాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఖండించేవారు, తిరస్కరించేవారు.

ఆ రోజుల్లో మైసూర్ మహారాజు ఒక వైపు నుండి, నిజాం నవాబు మరో వైపు నుండి ఆయనకు ఆహ్వానాలు పంపారు. రెండింటిలో విశ్వేశ్వరయ్య మైసూర్ మహారాజు ఆహ్వానాన్ని మన్నించి మైసూర్ మహారాజు వద్దకు రాగా ఆయనను మైసూరు రాజ్యానికి దివానుగా నియమించారు.

మహారాజా 1912లో విశ్వేశ్వరయ్యను కావాలని తన వద్ద దివానుగా నియమించగా, విశ్వేశ్వరయ్య స్నేహితులను, బంధువులను అందరినీ విందుకు పిలిచి  , విందు ఏర్పాటు చేసి చివరగా “మీరెవరూ సిఫారసు కోసం నా వద్దకు రావద్దు” అని నిక్కచ్చిగా చెప్పి పంపారు. తన కర్తవ్య నిర్వహణలో అత్యంత నిక్కచ్చిగా, నిజాయితీగా ఉన్నత ప్రమాణాలతో, నీతి నిజాయితీలే ఊపిరిగా జీవించిన మహా మనిషి ఆయన.

అయినప్పటికీ కొద్ది రోజులలోనే తన సమీప బంధువు ఒకరు తనకు పదోన్నతి కల్పించాలని తద్వారా తనకు నెలకు 50 రూపాయలు అదనంగా వస్తాయని కోరగా ఆ ప్రతిపాదనను తిరస్కరించి, ఆ బంధువు జీవించి ఉన్నంతకాలం తన జేబు నుండి వంద రూపాయలు ప్రతినెలా అతనికి పంపేవాడు.

దివానుగా తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి, సమగ్ర వికాసం కోసం మైసూరు రాజ్యం లో 4500 పాఠశాలలు ఉండగా, 6500 పాఠశాలలు స్థాపించారు. విద్యా రంగ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. పారిశ్రామిక పాఠశాలలు (ఐ టి ఐ), స్వతంత్ర రైల్వేలైన్లు ఏర్పాటుచేసి, 60 ఏళ్ళలో చేయలేని పనులను ఆరేళ్లలో చేసి చూపించిన ఘనుడాయన.

1918లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన ప్రజాసేవ నుండి, దేశ సేవ నుండి మాత్రం విరమించలేదు. నదులు, వరదలు, కష్ట నష్టాలపై అధ్యయనం చేసి ఆయన సమర్పించిన నివేదికల ఫలితంగానే మహానదిపై ‘హీరాకుడ్’ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది.

విశ్వేశ్వరయ్య గారు నిత్య విద్యార్థి. నిరంతర అధ్యయనశీలి. నూరేళ్ళ వయస్సులో బంధువొకాయన మద్రాసు వెళుతూ “నీకేం తెమ్మంటావు?” అని అడిగితే “అధునాతన ఆంగ్ల నిఘంటువు తెచ్చి పెట్టు” అని అన్నారట. జపాను, అమెరికా, ఇంగ్లండు వంటి ఎన్నెన్నో దేశాలు తిరుగుతున్న సమయంలో వారి చేతిలో ఒక నోటు పుస్తకం, పెన్సిలు ఉండేది. ఏదైనా కొత్త విషయం తెలిసినా, చదివినా దానిని వెంటనే ఆయన వ్రాసుకునేవారు.

గ్రీకు దేశంలోని ఏథెన్స్ నగరం కోసం వారు రూపొందించిన నీటి సరఫరా, మురుగు నీటి పారుదల వ్యవస్థలు ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందాయి. అనేక దేశాల వారు ఎంతో ధనం ఇస్తామని ఆహ్వానించినా తిరస్కరించి యావత్ జీవితాన్ని దేశ సేవకు సమర్పించిన ధన్యజీవి శ్రీ విశ్వేశ్వరయ్య.

కాలం ఆగకుండా ముందుకు సాగిపోయింది. రాజులు, రాజ్యాలు అంతరించాయి. దేశం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రధాని అయ్యారు.

ఆనాటికి 92 ఏళ్ల వయసున్న విశ్వేశ్వరయ్య, నెహ్రూ కోరికమేరకు పశ్చిమ బెంగాల్ లో ఫరక్కా ప్రాజెక్టుకు, బీహార్లో మొఖమా, రాజ్ మహల్, సక్రిగలి మొదలైన చోట్ల గంగానదిపై వంతెనలకు రూపకల్పన చేశారు. అందుకే నెహ్రూ, విశ్వేశ్వరయ్యను గొప్ప ఇంజనీర్ గా, దేశభక్తి, సమైక్యతా భావం కలిగిన వ్యక్తిగా, దీన జనుల ఆత్మబంధువుగా అభివర్ణించాడు.

మనదేశ ప్రణాళికలు ఎలా ఉండాలో సూచిస్తూ 1920లో ‘భారత పునర్నిర్మాణం’ అనే గ్రంథాన్ని, 1934లో ‘భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం’ అనే గ్రంథాన్ని రచించారు శ్రీ విశ్వేశ్వరయ్య. వారి ప్రతిభను, సేవను గుర్తించి భారత ప్రభుత్వం వారికి 1955లో ప్రతిష్టాత్మకమైన ‘ భారతరత్న’ బిరుదును ప్రసాదించింది.

ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య నెహ్రూకు ఉత్తరం రాస్తూ మీరు ‘భారతరత్న’ ఇచ్చారని నేను మీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, పొగుడుతూ ఉంటానని అనుకోకూడదు. నేను వాస్తవాలు వెల్లడించే మనిషిని. ఆ తర్వాత మీ ఇష్టం. అని వ్రాశాడు. దీంతో నెహ్రూ దృష్టిలో విశ్వేశ్వరయ్య మరింత ఎదిగిపోయారు.

ఆయన ఒకసారి ఇలా అన్నారు “నీ పని రైల్వే క్రాసింగ్ ఊడ్చడం మాత్రమే కావచ్చు. కానీ ప్రపంచంలో మరే ఇతర రైల్వే క్రాసింగ్ కూడా నీ క్రాసింగ్ అంత శుభ్రంగా ఉండదు అనిపించే విధంగా దానిని ఊడ్చడం నీ కర్తవ్యం అని గుర్తుంచుకో”. అని

నవభారత నిర్మాతలలో ఒకరుగా, నీతి, నిజాయితీ, అంకితభావం కలిగిన దేశభక్తుడిగా, నూతన ప్రమాణాలను నెలకొల్పిన కార్యకుశలుడిగా, దేశ కురువృద్ధుడిగా విఖ్యాతి గాంచిన విశ్వేశ్వరయ్య తన 101 ఏట 1962 ఏప్రిల్ 14న అస్తమించారు. వారి జీవితం మనందరికీ ఎంతో ఆదర్శం.

ఆయన దేశానికి చేసిన సేవ గొప్పది. ఆయన అమరుడు. దేశంలోని ఏ ప్రాజెక్టు చూసినా “మోక్షగుండం విశ్వేశ్వరయ్య సజీవంగా జీవించి ఉన్నాడు” అనిపిస్తుంది. ఆయన ఆలోచనలు, పథకాలు, ప్రణాళికలు పంట కాలువలై దేశమంతా ప్రవహిస్తున్నాయి.

అతి సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగిపోయిన విశ్వేశ్వరయ్య జీవితం నేటి బాలలకు, రేపటి పౌరులైన విద్యార్థులకు, యువతీ యువకులకు, యావద్దేశ ప్రజలకు ఎంతో ఆదర్శం.

నేడు డా|| మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి (ఇంజనీర్ల దినోత్సవం)

– శ్రీ పూడి వెంకట ప్రసాద్, ఉపాధ్యాయులు, వేగూరు, నెల్లూరు జిల్లా.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.