News

జమ్మూలో ముమ్మరంగా తీవ్రవాదుల ఏరివేత… కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. భద్రతాదళాల అదుపులో తీవ్రవాదులు

689views

మ్మూకాశ్మీర్‌‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. భద్రతా బలగాలు తప్పించుకుని తిరుగుతున్న కీలక ఉగ్రవాదిని పట్టుకున్నాయి. రాష్ట్రంలోని కిష్టవర్ జిల్లాలో పోలీసులు హిజ్బుల్ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని శనివారం అరెస్టు చేశారు. కుల్నా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పటిమహల్లా పల్మార్‌ వద్ద సంచరిస్తున్న ఓ ఉగ్రవాదిని చుట్టుముట్టి అరెస్టు చేసినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

పట్టుబడిన ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముజామిల్‌ షాగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇటీవల ముజామిల్‌ షా ఆ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్రవాది నుంచి ఒక గ్రెనెడ్, 30 రౌండ్ల తూటాలు, ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.