
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో విబేధాలు కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ పై మిగిలిన బోర్డు సభ్యులు ఇప్పటికే సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇటీవలే అజారుద్దీన్ కు అపెక్స్ కౌన్సిల్ ఊహించని షాక్ ఇచ్చింది. హెచ్ సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ తొలగించింది. ఈ నిర్ణయం ‘ఏకగ్రీవంగా’ ఉందని సుప్రీం కౌన్సిల్ తెలిపింది. అజారుద్దీన్ పై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయన్న కారణంతో అపెక్స్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏలో మహ్మద్ అజారుద్దీన్ సభ్యత్వాన్ని కూడా కౌన్సిల్ రద్దు చేసింది. 2019 సెప్టెంబర్ 27 న హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్‌కు షో-కాజ్ నోటీసు జారీ చేసింది.
తాజాగా హెచ్‌సీఏ సెక్రటరీ గురవా రెడ్డి అజారుద్దీన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అజారుద్దీన్ ఓ దేశద్రోహి అని, హెచ్‌సీఏలో ఆయన చేసిన అక్రమాలను బయట పెట్టాలని ఆరోపించారు. అజారుద్దీన్ తమపై నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా కేసు వేశారని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించినందుకు తమపై పరువు నష్టం దావా కేసు వేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.అజారుద్దీన్ రెండు కోట్లకు తమపై సివిల్ సూట్ కేసు వేశాడని గురువారెడ్డి తెలిపారు. ఫేస్ బుక్‌లో ఆరోపణలు చేసినందుకే తమపై పరువు నష్టం దావా కేసు వేశాడన్నారు. అజరుద్దీన్‌పై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులను మళ్ళీ రీ ఓపెన్ చేయాలని, సీబీఐ చేత అజరుద్దీన్ కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సివిల్ సూట్‌లో వేసిన పిటీషన్‌ను తాము కౌంటర్ వేశామని.. తాము వేసిన కౌంటర్‌కు ఇప్పటి వరకు అజారుద్దీన్ నుంచి సమాధానం లేదని అన్నారు. బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న అజారుద్దీన్ అమలు చేయడం లేదన్నారు.
అజారుద్దీన్ 2019 సెప్టెంబర్ 27 న హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, కానీ అప్పటి నుండి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో కూడా అజర్, హెచ్ సీఏ కార్యదర్శి విజయానంద్ స్టేజిపైనే గొడవపడ్డారు. సర్వసభ్య సమావేశంలో 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబుడ్స్ మెన్ గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం విషయంలో అజారుద్దీన్, విజయానంద్ మధ్య స్టేజీపైనే ఘర్షణ జరిగింది. హెచ్‌సీఏలో వివాదాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. వీటిని పరిష్కరించి, సంస్థను ప్రక్షాళన చేయడం కోసం కోసం గతంలో ఎన్నో కమిటీలు వేసినా ఇప్పటి వరకూ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఒక వర్గంగా.. మాజీ క్రికెటర్లు అర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్ మరో వర్గంగా ఉన్నారు. హెచ్‌సీఏలో అజారుద్దీన్ నాయకత్వంపై గతంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను అజార్ ప్రోత్సహించడంలేదని.. ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్స్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు గుప్పించారు.
Source : Nationalist Hub





