
ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితుల పట్ల భారత కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని.. వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఆఫ్ఘన్ ను వీడాలని భారత ప్రభుత్వం సూచించింది. ఆఫ్ఘన్ లో హింస ఇలాగే కొనసాగుతూ ఉంటే.. త్వరలోనే విమాన సర్వీసులు నిలిచిపోవచ్చని, ఆ లోపే భారత పౌరులు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే అనేక ప్రావిన్సులు, నగరాల మధ్య విమాన సర్వీసులు నిలిపివేస్తున్నారని.. ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటిస్తున్న, నివసిస్తున్న, పనిచేస్తున్న భారతీయులెవరైనా ఉంటే స్వదేశానికి వెళ్లే విమాన సర్వీసులపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని తెలిపింది. విమాన సర్వీసులు నిలిచిపోకముందే భారత్ కు తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ఆఫ్ఘన్ లో భారత దౌత్యకార్యాలయం ప్రకటనలో ఉంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తున్న భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులను ప్రాజెక్ట్ సైట్‌ల నుండి ఉపసంహరించుకోవాలని సూచనలు రావడంతో.. సదరు కంపెనీలు వారిని భారతదేశానికి తీసుకుని రావాలని యోచిస్తున్నాయి. నాన్-ఇండియన్ కంపెనీల కోసం పనిచేస్తున్న భారతీయులు కూడా అదే చేయాలని భారత ప్రభుత్వం కోరింది. ఆఫ్ఘన్ లో పని చేస్తున్న మీడియా ప్రతినిధులను ఉద్దేశించి కూడా కీలక సూచనలు చేసింది భారత ప్రభుత్వం. ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తున్న భారతీయ మీడియా వ్యక్తులందరూ ఎంబసీని సంప్రదించాలని కోరింది.
మజార్-ఇ-షరీఫ్ నుండి భారత పౌరులు, దౌత్యవేత్తల తరలింపు
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని మజార్-ఇ-షరీఫ్‌లోని భారతీయ కాన్సులేట్ ఢిల్లీకి బయలుదేరే ప్రత్యేక విమానం ఎక్కాలని భారతీయ పౌరులందరూ కోరుతున్నామంటూ ప్రకటన వచ్చింది. ఇప్పటికే కాందహార్, హెరాత్‌లోని భారతీయ కాన్సులేట్‌లను కూడా ఖాళీ చేయించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఆగష్టు నెలలో కేవలం 3 రోజుల్లో తాలిబాన్లు 5 ప్రధాన నగరాలు, ప్రాంతీయ రాజధానులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గత వారం కాబూల్ లోని వీఐపీ ప్రాంతాలలో కూడా బాంబు పేలుళ్లు సంభవించాయి.
Source : Nationalist Hub