
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే పుట్టినట్లు రుజువైందని అమెరికాకు చెందిన రిపబ్లికన్లు ఆరోపించారు. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేశారు. ఇందుకు సంబంధించి అనేక రుజువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా నిఘా సంస్థలు మాత్రం ఇంకా తుది అభిప్రాయానికి రాలేదు. వుహాన్ ల్యాబ్‌పై వస్తున్న ఆరోపణలను చైనా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తోంది.
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే ఆవిర్భవించిందనే ఆరోపణలకు బలం చేకూరేలా మరో నివేదిక బయటకు వచ్చింది. చైనా పరిశోధన కేంద్రం నుంచే ఈ మహమ్మారి పుట్టినట్లు అమెరికాలోని రిపబ్లికన్ ప్రతినిధి మైకేల్ మెక్‌కాల్ ఆరోపించారు. కరోనా వైరస్ మానవులకు సోకేలా వుహాన్ ల్యాబ్‌లో జన్యుపరమైన మార్పులు చేశారని, ఆ సంగతిని చైనా దాచిపెట్టిందని ఆరోపించారు. ఇందుకు తగిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయన్నారు. వుహాన్ ల్యాబ్ వద్ద పటిష్ఠమైన భద్రతా చర్యలు లేవని, ప్రమాదకర వ్యర్థ్యాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసే వ్యవస్థ కూడా సరిగా లేదని పేర్కొన్నారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మంది మరణించారంటూ మెక్‌కాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సీ ఫుడ్ మార్కెట్ ద్వారా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందనే ఓ వాదనను కూడా రిపబ్లికన్లు విడుదల చేసిన నివేదిక ఖండించింది. వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకయ్యిందని.. అది కూడా 2019 సెప్టెంబర్ 12వ తేదీకి ముందే జరిగిందని వెల్లడించింది.
కరోనా వైరస్ పుట్టుకపై దర్యాప్తు ముమ్మరం చేసి 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని.. అమెరికా నిఘా సంస్థలకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకిందా.. లేదంటే వుహాన్ ల్యాబ్ నుంచి లీకయ్యిందా అనే దానిపై అమెరికా నిఘా సంస్థలు ఇంకా ఓ తుది అభిప్రాయానికి రాలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్లు బయటపెట్టిన తాజా నివేదిక ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇన్ని ఆరోపణలు వస్తున్నా వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాక్స్, గబ్బిలాల్లోని వైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్ రికార్డులను ఎవరితో పంచుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.





