
కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో ఇప్పుడు కరోనా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగుతూ ఉండడంతో చైనాలో భారీ సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఇదే సమయంలో రెండు డోసులు అందుకున్న వారికి మూడో డోసును అందించేందుకు చైనా యోచిస్తోంది.
తొలుత నాంజింగ్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తోన్న తొమ్మిది మంది పారిశుద్ధ్య కార్మికులకు వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అనంతరం వారితో సన్నిహితంగా మెలిగిన వారిని పరీక్షించగా దాదాపు 200 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అవన్నీ డెల్టా వేరియంట్ (Delta Variant) వే కావడం, వారందరూ వ్యాక్సిన్ పొందిన వారే అవడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో తమ వ్యాక్సిన్‌ల ప్రభావం తక్కువే ఉందని గ్రహించిన అధికారులు.. డెల్టా రకం వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నాంజింగ్ నగరంలో కేవలం గురువారం ఒక్కరోజే 18 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో నగరంలో కొవిడ్ కేసుల సంఖ్య 200లకు చేరింది. వీటి విస్తృతి మరింత ఎక్కువగా ఉండొచ్చని భావించిన అధికారులు.. అన్ని గృహసముదాయాలను లాక్‌డౌన్ (Lock Down) చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా దాదాపు 90లక్షల జనాభా కలిగిన నగరం మొత్తం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఉపక్రమించారు. నాంజింగ్ నగరంలో పూర్తిస్థాయిలో కొవిడ్ పరీక్షలు నిర్వహించడం ఇది మూడోసారి కావడం విశేషం.





