ArticlesNews

మన సమాజ హితమే మన స్వార్ధం – మన గురుపూజకు ఇది పరమార్ధం

511views

వతార పురుషుడైన రాముడంతటి వానికి వశిష్ఠుడనే మహర్షి గురుస్థానం వహించాడు. జగద్గురువైన శ్రీ కృష్ణునికి కూడా సాందీపని గురువయ్యాడు.

గురు పరంపర ఈ జగత్తులో అనాదిగా ఉంది. సరైన గురువు దొరకడం పూర్వజన్మ సుకృతం. గురువును ప్రత్యక్ష దైవంగా భావించే సంస్కృతి మనది. అన్నిటికీ దైవమే స్వయంగా రాలేడు. అందుకే ఆయన వివిధ రూపాలలో అంటే తల్లి, తండ్రి, గురువు మొదలైన వారిగా మన శ్రేయస్సును చూస్తూ, ప్రేమను పంచుతూ మన అభ్యుదయానికి తోడ్పడతాడు. అందుకే ఈ ముగ్గురినీ దేవుళ్లుగా అభివర్ణించారు.

గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాను సాక్షాత్‌ పరబ్రహ్మగానూ పేర్కొన్నారు. గురువు అంటే మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపేవాడని స్థూలంగా పేర్కొంటుంటారు. సాధారణంగా గురువుల్లో రెండు రకాల వారిని మనం చూస్తుంటాం. వారిలో కొందరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వారైతే, మరి కొందరు లౌకిక విద్యను నేర్పించేవారు.

అయితే ఏ వ్యక్తి అయినా జీవితంలో గురువును ఆశ్రయించవలసిందే. ఒక్కోసారి మనం గురువును గుర్తించలేకపోవచ్చు. తాళం చెవి లేకుండా తలుపు తెరవడం సాధ్యం కానట్లు గురువు తర్ఫీదు లేకుండా మనకు గుర్తింపు, జ్ఞానం కలగదని వేమన తన పద్యాలలో వివరించారు.

సనాతన భారతీయ సంస్కృతిలో గురువుకు ఇంతటి ప్రాముఖ్యత ఉన్నది కనుకనే హిందూ సమాజ, ధర్మ పరమ వైభవం కోసం పనిచేసే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సనాతన హిందూ ధర్మానికి, చరిత్రకి, పూర్వీకుల శౌర్య పరాక్రమాలకి, ఋషి ముని జనుల త్యాగశీలతకు ప్రతీక అయిన పరమ పవిత్ర భగవాధ్వజాన్ని తన గురువుగా స్వీకరించింది.

వ్యక్తులు ఏదో ఒక నాడు వైయక్తికంగా పతనమయ్యే అవకాశం ఉన్నదని భావించిన సంఘ స్థాపకులు పరమ పూజనీయ డాక్టర్జీ మరియు అప్పటి ఇతర సంఘ పెద్దలు కాషాయ ధ్వజాన్నే సంఘానికి గురువుగా నిశ్చయం చేశారు.

సంఘ స్వయంసేవకులు ప్రతిరోజూ ఆ పవిత్ర భగవాధ్వజ ఛాయలో తమ శారీరిక, బౌద్ధిక వికాసం కోసం నియమితంగా, నిరంతర సాధన చేస్తారు. వేల ఏండ్ల భారత పౌరుష పరాక్రమాలకు, త్యాగనిరతికి, ఆధ్యాత్మిక, ఐహిక ప్రగతికి ప్రతీకగా నిలచిన పరమ పవిత్ర భగవాధ్వజమే స్వయంసేవకుల కఠోర సాధనకు, దేశభక్తికి, సేవా నిరతికి, నిష్కామ కర్మణ్యతకు మహా ప్రేరక మంత్రం, మౌన సాక్షి, మౌన గురువు.

సంఘ ప్రారంభం నుంచి స్వయంసేవకులు ధన కాంక్ష, పదవీ కాంక్ష, కీర్తి కాంక్ష అలా….. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా హిందూ సంఘటన కార్యానికి తను, మన పూర్వకముగా కటి బద్ధులై పనిచేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఏ వ్యక్తి అయినా, ఏ పవిత్ర కార్యానికయినా కేవలం తను, మన పూర్వకముగా పని చేయడమే కాక తన ఉదర పోషణకై ధనాన్ని తాను సమాజం నుంచే సంపాదించుకుంటున్నాడు కనుక కృతజ్ఞతాపూర్వకంగా సమాజానికి ధన రూపంలో కూడా కొంత సమర్పించుకోవలసిన అవసరం ఉంటుంది. అప్పుడే అతని నిష్కామ కర్మ యోగము పూర్తయినట్లు. తనను తాను సమాజ కార్యానికి సర్వస్వార్పణ గావించుకున్నట్లు.

అందుకే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ యుగయుగాలుగా, తరతరాలుగా, పరంపరగా మన పూర్వీకులు ఆచరిస్తూ వస్తున్న గురుపూజోత్సవ కార్యక్రమాన్ని స్వీకరించింది. గురుపౌర్ణమి రోజు, మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘ స్వయంసేవకులందరూ పరమ పవిత్ర భగవాధ్వజానికి భక్తితో ప్రణమిల్లి, యధాశక్తి ధనాన్ని సమర్పిస్తారు. ఇందులో తరతమ భేదాలు లేవు. బీద ధనిక తేడాలు లేవు. పెద్ద మొత్తంలో సమర్పించే వారికి సత్కారాలు, స్వల్పంగా సమర్పించే వారికి ఛీత్కారాలు వంటివేవీ లేవు. ఎంత గొప్ప వారైనా సామాన్యులతో సమానంగా కార్యక్రమం జరుగుతున్న చోటికి వచ్చి భగవాధ్వజానికి పూజ చేసి గురుదక్షిణ సమర్పించవలసిందే. ఆ సమర్పణ గుప్తంగానే ఉంటుంది కూడా. అదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ గురుపూజోత్సవ విశిష్టత. ఇలా ఏడాదికొకసారి వినమ్ర పూర్వకంగా చేసే గురుదక్షిణతో సమాజ కార్యానికై తాము చేసిన తను, మన, ధన సమర్పణ అంటే సర్వస్వార్పణ పూర్తయినట్లుగా స్వయంసేవకులు భావిస్తారు. సమాజ హితమే పరమావధిగా పయనించే స్వయంసేవకుల గమనం ఇలా చిరంతనంగా, నిరంతరంగా సాగుతూనే ఉంటుంది.

మన మాటలలో మన చేతలలో

మన ఎద మెదలే ప్రతి కదలికలో

మన సమాజ హితమే మన స్వార్ధం

మన గురుపూజకు ఇది పరమార్ధం.

భారత్ మాతాకీ జయ్.

– VSK ANDHRA DESK

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.