తాలిబన్లతో జట్టు కట్టిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్… భారత్లో దాడులకు పాక్ కుయుక్తి.. రక్షణ వర్గాల హెచ్చరిక

అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు అఫ్గానిస్థాలో విధ్వంసం సృష్టిస్తూ.. దేశాన్ని క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కీలకమైన భూభాగాలు వారి వశమైపోతున్నాయి.
భారత్లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తాలిబన్లతో కలిసి పనిచేస్తుండటం భారత నిఘా వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. కొద్దిరోజుల నుంచి ఈ పోకడలను గమనిస్తున్నట్లు.. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ.. భారత్‌పై ఈ ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. కచ్చితంగా ఇది ఆందోళకరమైన విషయమేనని… దీని వెనుక పాక్ హస్తం ఉందని పేర్కొన్నాయి.
ఈ రెండు ఉగ్రసంస్థలు తాలిబన్లకు మానవ వనరులను అందిస్తున్నాయి. పంజాబ్ ప్రావిన్స్ నుంచి ‘పోరాట యోధుల’ను అఫ్గాన్‌కు పంపుతున్నాయి. ఇటీవల తాలిబన్లు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో జైషే, లష్కరే భాగమయ్యారని వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముష్కరులు కనిపించినట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. ఐరాస భద్రతా మండలి నివేదిక సైతం ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ రెండు సంస్థలు పాకిస్థాన్ నుంచే పనిచేయడం, భారత్‌ను లక్ష్యంగా చేసుకొనే కార్యకలాపాలు సాగించడం గమనార్హం.