News

అవన్నీ అసత్యాలు – టీకా కొరత ప్రకటనలపై కేంద్ర మంత్రి మండిపాటు

749views

కరోనా టీకా కొరతను ఎదుర్కొంటున్నామంటూ ప్రకటిస్తున్న రాష్ట్రాలపై బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రాలు పనికిరాని ప్రకటనలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో వాటి వైఖరిని తప్పుపట్టారు.

‘కరోనా టీకాల లభ్యతపై పలు రాష్ట్రాల నుంచి నాకు లేఖలు అందాయి. వాస్తవ విశ్లేషణ ద్వారా ఈ పరిస్థితి సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేందుకే ఈ అనవసర ప్రకటనలు చేస్తున్నాయి. కేంద్రం ఎప్పటికప్పుడు టీకాల లభ్యతపై రాష్ట్రాలకు సమాచారం ఇస్తోంది. ఎన్ని టీకాలు ఎప్పుడు అందుతాయో వాటికి తెలుసు. దానికి అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటే.. ప్రజలు ఎలాంటి సమస్యా ఎదుర్కోరు. ఈ విషయంలో పలు రాష్ట్రాలు విఫలమయ్యాయి’ అని మాండవీయ మండిపడ్డారు.

టీకాలు నిండుకుంటున్నాయంటూ ఇటీవల దిల్లీ, తమిళనాడుతో సహా కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనిపై ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. తమకు తగినన్ని టీకా డోసులు కేటాయించడం లేదని దానిలో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.