News

పాక్ కొత్తగా తయారుచేస్తున్న హైబ్రిడ్ ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొంటాం – భారత భద్రతా దళాలు

857views

ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ‘హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌’ రూపంలో భద్రతా దళాలు సరికొత్త సవాలును ఎదుర్కొంటున్నాయి. గడచిన కొద్ది వారాలుగా శ్రీనగర్‌ సహా కశ్మీర్‌లో పలువురిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులు క్రమంగా పెరిగిపోయాయి. పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతితో నేరాలకు పాల్పడే యువత సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. అయితే వారంతా ఉగ్రవాదుల జాబితాలో లేనివారు కావడం గమనార్హం. దాడులు చేసి తిరిగి యథావిధిగా తమ జీవనం సాగిస్తుండటంతో హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌ను గుర్తించడం కష్టంగా మారింది.

ఇంతకీ ఎవరు వీరు?

హైబ్రిడ్‌ మిలిటెంట్స్ వారికి ఇచ్చిన లక్ష్యంపై దాడికి పాల్పడి తిరిగి ఎప్పటిలాగే వారి వ్యక్తిగత కార్యకలాపాల్లో నిమగ్నమైపోతారు. సాధారణంగా ఉగ్రవాదుల జాబితాలో లేకపోవడంతో భద్రతా దళాలకు వీరిని గుర్తించడం చాలా కష్టమవుతోంది. స్థానిక యువతను హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌గా పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థలు, ఆ దేశ గూఢచారి విభాగం ఐఎస్‌ఐ తయారుచేస్తున్నాయని సమాచారం. స్థానికంగా కొందరిని లక్ష్యంగా చేసుకొని అవసరమైనప్పుడు వారిపైకి హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌ను ఆ ఉగ్రముఠాలు ఉసిగొల్పుతాయి. తమకు ఇచ్చిన పనిని ఈ హైబ్రిడ్‌ మిలిటెంట్స్ ఎవరికీ అనుమానం రాకుండా పూర్తి చేసి.. తదుపరి ఆదేశాల కోసం వేచి చూస్తుంటారు. ఆ సమయంలో వారు తమ సాధారణ జీవనశైలినే కొనసాగించడం గమనార్హం.

మైనారిటీలు, నిరాయుధులైన వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, విధుల్లో లేని పోలీసులను లక్ష్యంగా చేసుకొని హైబ్రిడ్‌ మిలిటెంట్స్ ఎక్కువగా దాడులకు పాల్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తును అనుసరించి.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారిలో భయాందోళనలు కలిగించడమే వారి ప్రధాన ఉద్దేశం. పథకం ప్రకారమే వారు ముందుగా ఎంచుకున్న వ్యక్తులపై నిఘా పెడతారు. అదను చూసుకొని తుపాకులతో దాడి చేస్తారు. అయితే వారు ఎవరినైనా చంపడానికి ప్రత్యేకించి కారణమంటూ ఉండదు. ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చేసే నేపథ్యంలో.. సులువుగా చంపగలిగేవారిని ఈ హైబ్రిడ్‌ మిలిటెంట్స్ లక్ష్యంగా చేసుకొని హత్యలకు పాల్పడతారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.