
ఈ ఏడాది ప్రారంభంలో స్థానిక ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం బయట పేలుడు పదార్థాలు అమర్చుతూ సీసీ టీవీ కెమెరాకు చిక్కిన ఇద్దరు ఆగంతకులను గుర్తుపట్టిన వారికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ప్రకటించింది. ఆ ఇద్దరినీ గుర్తుపట్టేలా సమాచారం ఇచ్చినా, వారి అరెస్టుకు సహకరించినా రివార్డు ఉంటుంది. గత జనవరి 29న దిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం బయట మందుపాతర పేలింది. ఈ కేసును ఫిబ్రవరి 2న ఎన్‌ఐఏకు అప్పగించారు. 150 మీటర్ల మేర ప్రభావం చూపిన నాటి పేలుడులో ఎవరూ గాయపడలేదు. కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. పేలుడుకు సంబంధించి కొన్ని చిత్రాలు, వీడియో అందుబాటులో పెడుతున్నామని.. సమాచారం తెలిసినవారు ‘do.nia@gov.in’, ‘info.nia@gov.in’ చిరునామాలకు మెయిల్ చేయవచ్చని, 01124368800 లేదా 9654447345 నంబర్లకు ఫోను ద్వారా తెలుపవచ్చని ఎన్‌ఐఏ ప్రతినిధి తెలిపారు.





