News

చైనా భూలోక నరకం సృష్టించింది – వెల్లడించిన ఆమ్నెస్టీ

412views

వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీలు నివసించే షిన్‌జియాంగ్ రాష్ట్రంలో చైనా ఘోర నేరాలకు పాల్పడుతోందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పింది.

వీగర్లు, కజఖ్‌లు, ఇతర ముస్లిం మైనారిటీలను చైనా సామూహికంగా నిర్బంధిస్తోందని, వారిపై నిత్యం నిఘా పెడుతోందని, తీవ్రమైన హింసకు గురిచేస్తోందని.. ఐరాస జోక్యం చేసుకుని దర్యాప్తు చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో కోరింది.

మానవమాత్రులకు ఊహకందని స్థాయిలో చైనా అధికారులు షిన్‌జియాంగ్‌లో నరకాన్ని సృష్టిస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నస్ కలామర్డ్ ఆరోపించారు.

”నిర్బంధ శిబిరాల్లో పెద్దసంఖ్యలో వీగర్లు, ఇతర ముస్లిం మైనారిటీలను దారుణ హింసకు గురిచేస్తున్నారు.. వారితో అవమానకరంగా వ్యవహరిస్తున్నారు.. బలవంతంగా వారిపై తమ ఆలోచనలు, సిద్ధాంతాలను రుద్దుతున్నారు.. మానవాళిని ఇది ఎంతగానో కలవరపెడుతుంది” అని ఆగ్నస్ అన్నారు.

ఇంత జరుగుతున్నా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.

”గుటెరస్ ఈ పరిస్థితిని కనీసం ఖండించలేదు. షిన్‌జియాంగ్‌లో జరుగుతున్న పరిణామాలపై అంతర్జాతీయ దర్యాప్తునకూ ఆదేశించలేదు” అని ఆగ్నస్ అన్నారు.

”ఐరాస వ్యవస్థాపక విలువలను కాపాడాల్సిన బాధ్యత గుటెరస్‌పై ఉంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరుగుతున్నప్పుడు ఐరాస మౌనం వహించరాదు” అని తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.