కొవిడ్‌పై పనిచేసే 2డీజీ ఔషధం కోసం చాలామంది రోగులు ఎదురు చూస్తున్నారు. వీరిలో రెండుమూడు వారాల తర్వాత కూడా కోలుకోలేనివారే ఎక్కువగా ఉన్నారు. లక్షణాలు బయటపడిన పదిరోజుల్లోపే దీన్ని వాడాలని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. డీసీజీఐ ఆమోదం ప్రకారం 2 డీజీ ఔషధాన్ని కొవిడ్ రోగులకు ఎలా వాడాలో మార్గదర్శకాలను మంగళవారం వెల్లడించింది.
* డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం కొవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నెలక్రితం అనుమతి ఇచ్చింది. నీళ్లలో కలుపుకొని తాగే ఈ ఔషధాన్ని వైద్యుల సూచన మేరకే వాడాలి. వైద్యుల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ మందును ఉపయోగించాలి.
* ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్నవారు త్వరగా కోలుకునేందుకు 2 డీజీ తీసుకొచ్చారు. వీరికి కూడా వైద్యులు సాధ్యమైనంత తొందరగా వాడితే మేలు. గరిష్ఠంగా 10 రోజుల లోపే వాడాలి.
* మధుమేహం అదుపులో లేని, తీవ్రమైన గుండె సమస్యలున్నవారు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్‌ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్‌డీఎస్), కాలేయ, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారిపై 2డీజీ ఎలా పని చేస్తుందనేది అధ్యయనం చేయనందున జాగ్రత్తలు తీసుకోవాలి.
* కొవిడ్‌తో బాధపడుతున్న గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్లలోపువారికి ఈ ఔషధం ఇవ్వొద్దు.
* 2 డీజీ సాచెట్ల కోసం చికిత్స అందిస్తున్న ఆసుపత్రే హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను మెయిల్‌లో 2DG@drreddys.com సంప్రదించవచ్చు. ఈ నెలలో 6లక్షలకు పైగా సాచెట్లు అందుబాటులోకి వస్తున్నాయి.
త్వరగా కోలుకునేలా..
ఈ ఔషధం పొడి రూపంలో సాచెట్‌లలో లభిస్తుంది. నీళ్లలో కలుపుకొని తాగితే చాలు. వైరస్ ఉన్న కణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుంది. వైరస్ సోకిన కణాల్లో నేరుగా ప్రవేశించడం దీని ప్రత్యేకత. ఫలితంగా కొవిడ్ రోగులు చాలా వేగంగా కోలుకోవడానికి సహకరిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో గుర్తించారు. వేర్వేరు స్థాయిల్లో స్టాండర్డ్ ఆఫ్ కేర్‌తో పోల్చి చూసినప్పుడు సగటు కోలుకుంటున్న రోజులకంటే 2డీజీ ఔషధంతో చికిత్స పొందిన రోగులు రెండున్నర రోజులు ముందే కోలుకున్నట్లు గుర్తించారు. ఆక్సిజన్‌పై ఆధారపడటం 42 శాతం తగ్గింది.