News

ఆనందయ్య మందుపై పరిశోధన

840views

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పనితీరుపై పరిశోధన ప్రారంభమైంది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఏఎస్‌) 4 దశల్లో ఆ మందును విశ్లేషించనుంది. మొదటి దశలో భాగంగా మందు తీసుకున్నవారి అభిప్రాయాలను సేకరించనుంది. దీనికి సంబంధించిన బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానం, తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రికి సీసీఆర్‌ఏఎస్‌ అప్పగించింది.

ఇప్పటికే మందు తీసుకున్న వారి ఫోన్‌ నంబర్లను పోలీసులు సేకరించిన నేపథ్యంలో విజయవాడ ప్రాంతీయ పరిశోధన స్థానం, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి వైద్యులు మందు తీసుకున్న 500 మందికి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోనున్నారు. కరోనా పరీక్షల నివేదిక, మందు వేయించుకున్నప్పటి పరిస్థితిపై ఆరా తీయనున్నారు. ఆ తర్వాత ఉన్న పరిస్థితులు, ప్రస్తుత వైద్య నివేదికపై వివరాలను సేకరించనున్నారు. సీసీఆర్‌ఏఎస్‌ ప్రొఫార్మా ప్రకారం వివరాలను పొందుపరచనున్నారు. రెండ్రోజుల్లో దీన్ని పూర్తిచేయాలని ఆయుర్వేద వైద్యులను జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆదేశించింది. మందు ప్రభావం విశ్లేషణ ద్వారా సీసీఆర్‌ఏఎస్‌ ప్రాథమిక నిర్ధారణకు రానుంది. పూర్తిస్థాయి పరిశోధనలకు 4 నుంచి 5 వారాలు పట్టే అవకాశముందని వైద్యాధికారులు చెబుతున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.