
శ్రీరామనవమి.. చైత్ర శుద్ధ నవమి నాడు జరిగే మహా క్రతువు. మనిషి… మహిత చరితుడు ఎలా అవుతాడో తన నడవడి ద్వారా జగతికి చాటిన మర్యాదా పురుషోత్తముడు… శ్రీరాముడు. ఆయన జననం పట్టాభిషేకం, కళ్యాణం అన్ని శ్రీరామనవమి రోజే జరిగాయని భక్తుల నమ్మకం.. తెలుగు రాష్ట్రాలలో భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణం ఒకెత్తయితే… కడప జిల్లా ఒంటిమిట్ట లో జరిగే పున్నమి కళ్యాణం మరో ఎత్తు..
ఏకశిలా నగరమే ఒంటిమిట్ట….

ఒకప్పటి ఏకశిలా నగరమే.. నేటి ఒంటిమిట్ట. రామాయణం తో ముడిపడి ఉన్న ఈ ఆలయ స్థల పురాణం ఆసక్తికరం. సీత సహితంగా అరణ్యవాసం చేస్తున్న రామచంద్రుడు… ఈ ప్రాంతం గుండా వెళుతుండగా..మృకండుడు అనే మహర్షి రాముడ్ని దర్శించాడు. తన యాగ రక్షణ చేయమని కోరాడు. అందుకు ఒప్పుకున్న రాముడు యాగ సంరక్షణ చేసి.. ఈ ప్రాంతాన్ని అనుగ్రహించి దక్షిణ దిశగా సాగిపోయాడు. రాముడు చేసిన మేలుకు గుర్తుగా మృకండు మహర్షి ఒకే శిలపై సీతారాముల రూపాలు చెక్కారు. ఈ విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణ ప్రతిష్ట చేశాడని స్థల పురాణం. అనంతరకాలంలో విజయ నగర రాజులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వారి పేరు మీదే ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది. రాములవారు హనుమను కలవక ముందే ఇక్కడకు వచ్చారు కాబట్టి ఆంజనేయుడి విగ్రహం ఇక్కడ కనపడదు. పోతన తన భాగవతాన్ని ఈ స్వామికే అంకితమిచ్చారు.
కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా వేడుకలు…
కరోనా నేపథ్యంలో ఈసారి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. అనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఏప్రిల్ 20న వ్యాస అభిషేకం, 21న శ్రీరామనవమి తో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. చతుర్దశి నాటి రాత్రి 26న కళ్యాణోత్సవం, మర్నాడు రథోత్సవం, 30న పుష్పయాగం, ఏకాంత సేవ తో ఉత్సవాలు ముగుస్తాయి.





