
ఏదైనా ఒక ఇనుప వస్తువు మనం బయటపెట్టి ఓ పది రోజులు లేదా నెల రోజుల పాటు దాని గురించి మర్చిపోయామనుకోండి….. అది ఏమై పోతుంది? తుప్పుబట్టి పోతుంది. కానీ వేల సంవత్సరాల నాటి లోహపు స్తంభమొకటి ఇప్పటికీ తుప్పు పట్టకుండా ఉంది. అది కూడా మన దేశంలోనే. అదీ దేశ రాజధాని ఢిల్లీలోనే. ఇక విషయమేంటో తెలుసుకుందాం…….
ఢిల్లీ నగరంలో కుతుబ్ మినార్ ఆవరణలో ఉంది ఈ ఇనుప స్తంభం. దీన్ని పదహారు వందల ఏళ్ళ క్రితం రెండవ చంద్రగుప్తుడు విష్ణు పాద కొండలమీద ఏర్పాటు చేశాడు. 23 అడుగుల ఎత్తు, మూడు టన్నుల బరువు, 16 అంగుళాల వ్యాసం.. ఉన్న ఈ స్తంభం భారతీయ శాస్త్ర నైపుణ్యానికి ప్రతిబింబం. ఈ స్తంభంపైన సంస్కృత భాషలో బ్రాహ్మీ లిపిలో వ్రాసిన శాసనాలను చదవటానికి ఎందరో ప్రయత్నించి చివరకు సాధించారు. మనదేశంలో కర్కాటక రేఖ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం రాష్ట్రాల గుండా వెళుతుంది. ఎక్యునాక్సడే.. సూర్యుడి గమనం సాగే రేఖ మార్గంలో విష్ణు పాద కొండలమీద దీన్ని నిర్మించారు. ఖగోళ అధ్యయనం కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంతకుమించిన లోహ శాస్త్ర విజ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉంది.
బ్రిటిష్ కాలంలో పురావస్తు శాస్త్రవేత్త జేమ్స్ 1817లో ఈ స్తంభం గురించి అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియజేశాడు. లోహ శాస్త్రవేత్త రాబర్ట్ 1912 లో దీనిమీద పరిశోధనలు మొదలు పెట్టాడు.. అనంతరకాలంలో ఎందరో శాస్త్రవేత్తలు దీనిని పరిశోధించి 300కు పైగా పరిశోధనా పత్రాలు, పుస్తకాలు ప్రచురించారు. ఆధునిక ప్రపంచంలో ఇది ఒక అద్భుత ఆవిష్కరణగా తేల్చారు. ఈ ఇనుప స్తంభాన్ని తుప్పు పట్టని లోహపు పూత మందం మిల్లి మీటరు లో 20వ వంతు మాత్రమే. ఇన్ని సంవత్సరాలుగా ఇది తుప్పు పట్టకుండా ఉండడానికి కారణమేమిటో తెలుసుకోవడానికి, దానికి పై పూతగా వాడిన పదార్థమేమిటో తెలుసుకోవడానికి ఇప్పటికీ దీని మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.





