
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సహచర రోగిని మరో రోగి కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా షాజహాన్ పూర్ లో గల స్టేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగింది. ఆసుపత్రిలో డయేరియా చికిత్సకోసం చేరిన 25ఏళ్ల అబ్దుల్ రెహమాన్ అదే గదిలో మరో బెడ్ పై జ్వరము, నీరసములతో చికిత్స పొందుతున్న 45 ఏళ్ల హన్స్ రామ్ ను హత్య చేశాడు.
సిబ్బంది కథనం ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్ రెహమాన్ వాష్ రూమ్ కి వెళ్లి వచ్చి చూసి తన బెడ్ పై హన్స్ రామ్ ఉన్నాడని భావించాడు. అతన్ని ఆ బెడ్ మీద నుంచి లేచి వెళ్లవలసిందిగా చెప్పాడు. దానికి తిరస్కరించిన హన్స్ రామ్ ను ఒక్క ఉదుటున మంచం మీద నుంచి కింద పడేసి అతని ఛాతీ మీదకి ఎక్కి అతన్ని ఇస్టానుసారంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన హన్స్ రామ్ అదే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు.
నిజానికి హన్స్ రామ్ చికిత్స పొందుతున్న బెడ్ కి, అబ్దుల్ రెహమాన్ చికిత్స పొందుతున్న బెడ్ కి ఏమీ సంబంధం లేదు. ఆసుపత్రి వారు హన్స్ రామ్ కు 21వ నంబరు బెడ్ ను కేటాయించగా, అబ్దుల్ రెహమాన్ కు 27 వ నంబరు బెడ్ ను కేటాయించారు.
జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుని బంధువులు, హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యమే ఘటనకు కారణమని ఆరోపిస్తూ హాస్పిటల్ పై దాడికి దిగారు. దాంతో హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ ఇంద్ర విక్రమ్ సింగ్, షాజహాన్పూర్ సీనియర్ పోలీసు అధికారులు హాస్పిటల్ ను సందర్శించారు.
అయితే హంతకుడు అబ్దుల్ రెహమాన్ తండ్రి రెహమాన్ మాత్రం తన కుమారునికి మతిస్థిమితం లేదని చెబుతున్నాడు. అయితే అందుకు తగిన ఆధారాలను, పత్రాలను మాత్రం ఆయన పోలీసులకు చూపలేకపోయాడు.
బరేలీ జిల్లా ఎస్పి సంజయ్ కుమార్ మాట్లాడుతూ హంతకునిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశామని, అరెస్టు చేశామని తెలిపారు. “అతను మా ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసుల చర్యలపై సంతృప్తిగానే ఉన్నారు.” అని ఆయన తెలియజేశారు.
Source : OPINDIA.





