జమ్మూకాశ్మీర్లో నివసిస్తున్న రోహింగ్యా అక్రమ చొరబాటుదారుల ఆధార్ మరియు రేషన్ కార్డులను తొలగించనున్న ప్రభుత్వం

జమ్మూకాశ్మీర్లో నివసిస్తున్న రోహింగ్యా అక్రమ చొరబాటుదారుల ఆధార్ మరియు రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా వారికి అక్రమంగా ఆ కార్డులను జారీచేసిన ప్రభుత్వ అధికారుల పైన కూడా చర్య తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈమధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ లోకి అక్రమంగా ప్రవేశించి, నివసిస్తున్న రోహింగ్యాల కోసం చేపట్టిన గాలింపు చర్యలలో రక్షణ సంస్థలు అనేక అక్రమ ఆధార్, రేషన్ కార్డులను వారి నుంచి స్వాధీనం చేసుకుంది. సరైన ఆధార పత్రాలు లేకుండానే ప్రభుత్వ అధికారులు వారికి అక్రమంగా ఆ కార్డులను జారీ చేసినట్లుగా రక్షణ సంస్థలు గుర్తించాయి. వాటిని జారీ చేసే క్రమంలో అధికారులు నిబంధనలను సరిగా పాటించలేదనే విషయాన్ని రక్షణ సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో అందుకు బాధ్యులైన అధికారులపై శాఖా పరమైన మరియు న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఉద్యుక్తమవుతోంది.
నిజానికి ప్రతి భారత పౌరుడి యొక్క పత్రాలను బయోమెట్రిక్ పద్ధతిలో పరిశీలించి “యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా” (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) ద్వారా ప్రతి ఆధార్ కార్డు కి ఒక ప్రత్యేకమైన 12 అంకెల గుర్తింపు సంఖ్య ఇవ్వబడుతుంది. కానీ క్రింది స్థాయి ఉద్యోగులు కొందరు దానికి ఉపయోగపడే రేషన్ కార్డులను పెద్ద మొత్తంలో అక్రమంగా జారీ చేసినట్లుగా సదరు సంస్థల పరిశీలనలో తేలింది. దానిద్వారా రోహింగ్యా అక్రమ చొరబాటుదారులు పెద్ద ఎత్తున తమకు అవసరమైన గుర్తింపు పత్రాలను పొందినట్లుగా అధికారులు భావిస్తున్నారు. రేషన్ కార్డు కోసం జరిపే పరిశీలనలో క్రింది స్థాయి ఉద్యోగులు సదరు వ్యక్తిని గుర్తిస్తే సరి పోతుండడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు.





