News

ప్రపంచానికి దారి చూపేది భారతదేశమే – పరమపూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్

775views

“ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవించేది హిందూ సమాజం. అలాగే ప్రపంచానికి దారి చూపగలిగినది కూడా భారతదేశం’”అని రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. కాలకూట విషాన్ని కూడా గరళంలో ఉంచుకుని శివుడు ప్రపంచాలను కాపాడాడని, అదేవిధంగా ప్రపంచంలో కలిగే అనేక వికృతులు, విపత్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడగలిగేది భారతదేశమనే విషయాన్ని అన్నీ దేశాలు గుర్తిస్తున్నాయని ఆయన అన్నారు. హైదరబాద్ హైటెక్స్ లో జరిగిన ద్విస‌హ‌స్రావ‌ధాని మాడుగుల నాగ‌ఫ‌ణిశ‌ర్మ ర‌చించిన విశ్వ‌భార‌తం గ్రంథ ఆవిష్క‌ర‌ణ సభలో ఆయన మాట్లాడారు.

భక్తి భావనతో చేసే ప్రతి పని విజయవంతమవుతుందని, ధర్మానికి కేంద్ర బిందువైన మన దేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటివి అవి ఏర్పడిన నాటి నుంచి నేటివరకు అశాంతి, అలజడితోనే ఉన్నాయని మనకు తెలుస్తోందని డా. మోహన్ భాగవత్ అన్నారు. దేశవిభజన ఎన్నటికీ కాదని జవహర్ లాల్ నెహ్రూ మొదలైనవారు ఎంత గట్టిగా చెప్పిన చివరికి దానిని తప్పించలేకపోయారని, ఈ దేశం నుండి విడిపోయిన భూభాగాలు భవిష్యత్తులో తిరిగి కలవవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

అంతకుముందు ద్వి స‌హ‌స్రావ‌ధాని మాడుగుల నాగ‌ఫ‌ణిశ‌ర్మ కార్య‌క్ర‌మ విశిష్ట‌త‌ను వివ‌రిస్తూ ఈ భూమండలమంతా ఒకప్పుడు భారత ధర్మమే విస్తరించి ఉండేదని అన్నారు. అటువంటి ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి భుజస్కండాలపైనా ఉందని అన్నారు.

మొద‌ట‌గా ప్రాంగ‌ణంలోని స‌ర‌స్వతీ దేవాల‌యానికి విచ్చేసి అమ్మ‌వారికి పూజ‌లు నిర్వ‌హించారు. అక్క‌డ జ‌రుగుతున్న హోమంలో పాల్గొని పూర్ణాహుతి స‌మ‌ర్పించారు. అనంత‌రం ఆవిష్క‌ర‌ణ స‌భ‌కు విచ్చేశారు. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న‌, ప్రార్థ‌నా గీతం తరువాత డా. మోహన్ భాగవత్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్కృత విశ్వవిద్యాల‌యం మాజీ డీన్ రాణీ స‌దాశివ మూర్తి, ప‌ద్మ‌శ్రీ బిరుదాంకితులు ర‌మాకాంత్ శుక్లా విచ్చేశారు. శ్రీ దూసి రామకృష్ణ, దక్షిణ మధ్య క్షేత్ర సహ సంఘచాలక్, శ్రీ శ్యామ్ కుమార్, అఖిలభారతీయ ధర్మజాగరణ సమన్వయ సహసంయోజక్, శ్రీ బూర్ల దక్షిణామూర్తి, తెలంగాణ ప్రాంత సంఘచాలక్, శ్రీ సుధీర్, దక్షిణమధ్య క్షేత్ర ప్రచారక్, శ్రీ కాచం రమేష్, తెలంగాణ ప్రాంత కార్యవాహ్, శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రాంత సహకార్యవాహ, శ్రీ దేవేందర్, తెలంగాణ ప్రాంత ప్రచారక్ తదితరులు పాల్గొన్నారు.

చివ‌ర‌గా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పండితుల‌కు స‌త్కారం చేశారు. అనంత‌రం నాగ‌ఫ‌ణిశ‌ర్మగారి వంద‌న స‌మ‌ర్ప‌ణతో కార్యక్రమం ముగిసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.