
ఈ ఏడాది జరగబోయే జీ-7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని యునైటెడ్ కింగ్‌డమ్ ఆహ్వానించింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు కూడా ఆహ్వానం పంపింది. జూన్‌లో జరగబోయే ఈ సదస్సుకు బ్రిటన్ తీర ప్రాంతంలో ఉన్న కార్నవాల్ రిసార్ట్ వేదిక కానుంది. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాల కూటమే ఈ జీ-7. ఈ సదస్సులో భాగంగా కరోనా వైరస్ మహమ్మారి, పర్యావరణ మార్పులు, సాంకేతికపరమైన అభివృద్ధి, శాస్త్రీయ ఆవిష్కరణలు, స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చించనున్నారు.
అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది సూచిక : నిపుణులు
అయితే, ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌ను భారత్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. కానీ, కరోనా కొత్త స్ట్రెయిన్ యూకేలో విజృంభిస్తుండడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే, జీ-7 సదస్సు కంటే ముందే భారత్‌లో పర్యటించే అంశాన్ని బోరిస్ పరిశీలిస్తున్నట్లు అక్కడి స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 2020లో జరగాల్సిన జీ-7 సదస్సు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. 2019లో ఫ్రాన్స్ లోని బియారిట్జ్ లో చివరి సమావేశం జరిగింది. అయితే, జీ-7కు భారత్‌కు ఆహ్వానం అందడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇది సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.





