
ఓ చిన్న సైజు ఉగ్రవాద బృందాన్ని నిర్వహిస్తున్న 10 మంది చైనీయులను అఫ్గాన్ దళాలు కాబూల్‌లో అదుపులోకి తీసుకొన్నాయి. వీరందరికి ఉగ్ర సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయి. ఈ ఘటనతో చైనాకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఈ 10 మంది అఫ్గానిస్థాన్‌లో గూఢచర్యం చేయడంతోపాటు టెర్రర్ సెల్ కూడా నిర్వహిస్తున్నారని నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. వీరికి చైనా నిఘా ఏజెన్సీ అయిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్రటరీతో కూడా సంబంధాలున్నట్లు తేలింది.
అఫ్గాన్‌లో గూఢచర్యం చేస్తూ చైనీయులు దొరికిపోవడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. అఫ్గాన్ భూభాగం నుంచి అమెరికా వైదొలిగాక.. పట్టు సాధిద్దామని చైనా కాచుకు కూర్చొంది. ఇలాంటి సమయంలో ఈ ఘటన వెలుగు చూడటం డ్రాగన్‌కు ఎదురుదెబ్బ.
ఈ విషయంపై అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి ఉపాధ్యక్షుడు అమ్రుల్లాహ్ సలేహ్ వివరించారు. అనంతరం సలేహ్ చైనా రాయబారి వాంగ్‌యూతో కాబూల్‌లో భేటీ అయ్యారు. అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించినట్లు.. కాబూల్ నమ్మకాన్ని వమ్ము చేసినట్లు పేర్కొంటూ చైనా అధికారికంగా క్షమాపణ తెలియజేస్తే.. ఈ 10 మందికి క్షమాభిక్ష పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన వాంగ్‌కు తెలిపారు. లేకపోతే తమ చట్టాల ప్రకారం దర్యాప్తును ముందుకు తీసుకెళతామని స్పష్టం చేశారు. అరెస్టు అయిన వారిలో లీయాంగ్ యాంగ్ జులై నుంచి చైనా నిఘా సంస్థ కోసం పనిచేస్తున్నారని అఫ్గాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. చైనీయుల నుంచి ఆయుధాలు, మందుగుండుతో పాటు కెటమైన్ అనే మాదకద్రవ్యాన్ని కూడా స్వాధీనం చేసుకొన్నారు. వీరు అల్‌ఖైదా, తాలిబన్లు, అఫ్గాన్ భూభాగంలోని వీగర్ ముస్లింల సమాచారం సేకరించారు. చైనీయులు నిర్వహించే హోటల్‌లో భారీగా పేలుడు పదార్థాలను గుర్తించారు.





