News

కొత్త పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని

318views

ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్‌ కొత్త భవనానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సంసద్‌ మార్గ్‌లో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పునాదిరాయి వేసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తొలుత కేంద్రం భావించింది. అయితే, సెంట్రల్‌ విస్టా నిర్మాణంపై కేసు నడుస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా చేపట్టారు. శంకుస్థాపనకు గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ ‌నాథ్ సింగ్‌, పీయూష్‌ గోయల్‌, లోక్ ‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా, విదేశీ రాయబారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త భవనం నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్‌ లిమిటెడ్ ‌కు ఇచ్చిన విషయం తెలిసిందే.

కొత్త భవనంలో అణువణువునా భారతీయత ప్రతిబింబించనుంది. లోక్ సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రిచెట్టు పార్లమెంటులో అంతర్భాగంగా నిలువనుంది.

ఈ రోజు భారతీయులకు చరిత్రాత్మక దినం : ప్రధాని మోడీ

ఈ రోజు భారతీయులకు చరిత్రాత్మక దినం అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. నూతన పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. 130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ సుదినం ఇది. దేశ ప్రజలందరూ కలిసి నిర్మించుకుంటున్న భవనం ఇది. స్వాతంత్ర్యం వచ్చిన 75ఏళ్ల సందర్భానికి గుర్తుగా ఈ భవనం నిలవనుంది. ప్రస్తుత పార్లమెంట్‌ భవనంలోనే భారత రాజ్యాంగ రచన జరిగింది.’ అని ప్రధాని అభివర్ణించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.