News

గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ భారత్ లో అంతర్భాగమే – పాక్ కు స్పష్టం చేసిన భారత్

676views

గిల్గిత్‌-బాల్టిస్థాన్‌కు తాత్కాలిక ప్రావిన్షియల్‌ హోదా కల్పిస్తున్నట్లు పాకిస్థాన్‌ అధికారికంగా ప్రకటించింది. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ ప్రటకన చేశారు. అయితే, దీన్ని భారత్‌ పూర్తిగా ఖండించింది. ఇది భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించే ప్రయత్నమేనని పాకిస్థాన్‌ను హెచ్చరించింది. చట్టప్రకారం జమ్మూ కశ్మీర్‌, లడ్డాఖ్‌తోపాటు గిల్గిత్‌-బాల్టిస్థాన్‌గా పిలిచే ప్రాంతం మొత్తం భారత్‌లో అంతర్భాగమేనని…. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ పునరుద్ఘాటించారు. చట్టవిరుద్ధంగా, బలవంతంగా తాము ఆక్రమించిన భూభాగాలపై ఎలాంటి అధికారం పాకిస్థాన్‌కు లేదని స్పష్టంచేశారు. ఏడు దశాబ్దాలుగా ఆప్రాంతంలో నివసిస్తున్న ప్రజల స్వేచ్ఛను హరిస్తూ మానవహక్కుల ఉల్లంఘనకు, దోపిడీకి పాల్పడుతున్న పాకిస్థాన్, ఇలాంటి దురాక్రమణ ద్వారా ఆ నిజాలను దాచలేదని పేర్కొంది. భారత్‌ భూభాగాలపై ఇలాంటి దురాక్రమణలు ఆపేసి, ఇప్పటికే వారి ఆక్రమణలో ఉన్న ప్రాంతాలన్నింటినీ వెంటనే ఖాళీచేయాలని పాకిస్థాన్‌కు భారత్ స్పష్టం చేసింది.

వివాదాస్పద గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ను తమ దేశంలో లాంఛనంగా విలీనం చేసుకోవాలని పాకిస్థాన్‌ ఎన్నోరోజులుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ (జి-బి) స్థాయిని మార్చాలని పాక్‌ ప్రభుత్వం ఈ మధ్యే నిర్ణయించింది. తాజాగా గిల్గిత్‌ పర్యటన ద్వారా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రావిన్షియల్‌ హోదాపై అధికారిక ప్రకటన చేశారు. నిజానికి గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఉంది. దీన్ని అలాగే ఉంచేందుకు, తన వాదనలకు చట్టబద్ధత కల్పించేందుకు పాక్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ప్రావిన్షియల్‌ ఆర్డినెన్స్‌ల ద్వారా పాలిస్తోంది. తరచూ విధానపరమైన మార్పులను చేయడం ద్వారా గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ రాజ్యాంగ హోదాపై ఉద్దేశపూర్వకంగా అస్పష్టతను కలిగించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.