
కరోనా వ్యాప్తి నియంత్రణలో ‘ఆరోగ్య సేతు’ యాప్ మెరుగ్గా పనిచేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులను గుర్తించడంలో మొబైల్ అప్లికేషన్ల వంటి డిజిటల్ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని టెడ్రోస్ అన్నారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన ఆరోగ్య సేతు యాప్ సహా ఇతర దేశాల్లోని హెల్త్ యాప్‌ల గురించి ప్రస్తావించారు.
‘భారత్‌కు చెందిన ఆరోగ్య సేతు యాప్‌ను 15 కోట్ల మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో ప్రభుత్వ ఆరోగ్యశాఖలకు ఈ యాప్ ఎంతగానో సాయపడుతోంది. దాని వల్ల విస్తృత కరోనా పరీక్షల నిర్వహణ సులభతరమవుతోంది’ అని టెడ్రోస్ కొనియాడారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గత నాలుగు రోజులుగా రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదైనట్లు టెడ్రోస్ తెలిపారు. ముఖ్యంగా యూరప్, అమెరికాల్లో కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు.
కరోనా ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వైరస్ పాజిటివ్ వ్యక్తులకు దగ్గరగా వెళ్లినప్పుడు బ్లూటూత్, లొకేషన్ ట్రాకింగ్ ఆధారంగా ఈ యాప్ మనల్ని అప్రమత్తం చేస్తుంది. అంతేగాక, ఆయా ప్రాంతాల్లో కేసుల తీవ్రతను కూడా తెలియజేస్తుంది.





