News

అటల్‌ సొరంగాన్ని ప్రారంభించిన మోడీ

558views

హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని(అటల్‌ టన్నెల్‌) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. అనంతరం సొరంగంలో కాసేపు నడిచారు. ప్వెంరధాని వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఉన్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి-లేహ్‌ జాతీయ రహదారిపై లాహౌల్‌-స్పిటీ జిల్లాలో రోహ్‌తంగ్‌ పాస్‌ వద్ద 9.2 కిలోమీటర్ల మేర ఈ సొరంగాన్ని నిర్మించారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో 2000 జూన్‌ 3న ఈ సొరంగ మార్గం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత అంటే 2002 మే 26 తేదీన ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. వాతావరణ పరిస్థతులు, ఇతరత్రా కారణాల వల్ల ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది. గతంలో దీన్ని రోహ్‌తంగ్ టన్నెల్ అని పిలిచేవారు. 2019 డిసెంబరు 24 తేదీన అటల్‌ టన్నెల్‌గా పేరు మార్చారు. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) ఈ సొరంగ మార్గం నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది.

 సొరంగం విశేషాలు

* సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన సొరంగ మార్గాల్లో ఇదే అత్యంత పొడవైంది. నిర్మాణానికి అయిన వ్యయం సుమారు రూ.3,300 కోట్లు.

* ఈ సొరంగంతో మనాలి – లేహ్‌ల మధ్య 46 కి.మీ. దూరం తగ్గనుంది.

* దేశ రక్షణ పరంగా దీనికి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. సరిహద్దుల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ఈ సొరంగం ద్వారా సైనిక వాహనాల్లో సామగ్రిని త్వరితగతిన తరలించొచ్చు.

* హిమాచల్‌ ప్రజలకూ ఇది ఎంతో ప్రయోజనకరం. సాధారణంగా అక్కడ ఆరు నెలల పాటు దట్టంగా కురిసే మంచు వల్ల స్థానికులకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అయితే సొరంగ మార్గం ద్వారా ఇక ఆ ఇబ్బంది ఉండదు.

* సొరంగంలో ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్‌,60 మీటర్లకు అగ్ని మాపక వ్యవస్థ, 500 మీటర్లకు అత్యవసర మార్గం, 250 మీటర్లకు సీసీ కెమెరా, 2.2 కి.మీ.లకు వెలుతురు ప్రసరించే వ్యవస్థ, 1 కి.మీ.కు గాలి నాణ్యతను పరీక్షించే వ్యవస్థ లాంటి సౌకర్యాలు ఉంటాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.