News

6 సంవత్సరాలు – 58 దేశాలు – అనేక దౌత్య విజయాలు

725views

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్రం వెల్లడించింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 నుంచి ఆయన మొత్తం 58 దేశాల్లో పర్యటించారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. 58 దేశాల్లో పర్యటనకు రూ.517.82 కోట్లు ఖర్చయిందని వెల్లడించారు. ప్రధాని అమెరికా, రష్యా, చైనాల్లో ఐదు సార్లు పర్యటించారని తెలిపారు. అలాగే, సింగపూర్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, శ్రీలంక, యూఏఈ వంటి దేశాల్లో పలుమార్లు పర్యటనకు వెళ్లారని వివరించారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు దేశాల్లో పర్యటించారని పేర్కొన్నారు. మోదీ చివరిసారిగా నవంబర్‌ 13, 14 తేదీల్లో బ్రెజిల్‌లో పర్యటించారని తెలిపారు. బ్రిక్స్‌ దేశాల సమావేశంలో పాల్గొన్నారని మంత్రి చెప్పారు.

ప్రధాని మోదీ పర్యటనలతో ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై భారతదేశ దృక్పథాన్ని ఆయా దేశాల అవగాహనను మరింతగా పెంచేందుకు దోహదపడ్డాయని తెలిపారు. మోదీ పర్యటించిన దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత దృఢమయ్యాయని, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక, రక్షణ రంగాల్లో సహకారం కూడా పెరిగిందని మంత్రి చెప్పారు. వాతావరణ మార్పులతో పాటు సైబర్‌ సెక్యూరిటీ, ఉగ్రవాదం తదితర అనేక అంశాలపై ప్రపంచ స్థాయిలో ఎజెండాను రూపొందించడంలో భారతదేశం సహకారం ఎక్కువగా ఉందని చెప్పారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.