492
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశేష ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రం ‘లవకుశ’లో లవుడి పాత్ర పోషించిన నటుడు నాగరాజు కన్నుమూశారు. హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
1963లో వచ్చిన ‘లవకుశ’ సినిమాలో రాముడు పాత్రలో ఎన్టీఆర్, సీత పాత్రలో అంజలీదేవి, లవుడి పాత్రలో నాగరాజు, కుశుడు పాత్రలో సుబ్రమణ్యం, వాల్మీకి పాత్రలో చిత్తూరు నాగయ్య, లక్ష్మణుడు పాత్రలో కాంతారావు నటించారు. సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకులు. ఘంటసాల సంగీతం అందించారు. 1958లో ప్రారంభమైన ఈ సినిమా పూర్తిగా కలర్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా నిలిచింది.