318
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక రహదారుల నిర్మాణాలను మన దేశం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) అధిక సంఖ్యలో మానవ వనరులను సమకూర్చుకొని, అత్యాధునిక యంత్రాలతో రేయింబవళ్లు పనులు కొనసాగిస్తోంది. దీంతో హిమాచల్‌ప్రదేశ్ నుంచి లద్దాఖ్ వరకు కీలక రహదారి ఒకటి దాదాపుగా (30 కిలోమీటర్లు మినహా) పూర్తి కావొచ్చింది. సైనికులను సురక్షితంగా సరిహద్దులకు చేర్చగల వీలుండటం దాని ప్రత్యేకత. నిమ్ము-పదమ్-దార్చాగా పేర్కొనే ఈ రహదారి పొడవు 258 కిలోమీటర్లు. సరిహద్దుల్లో నిర్మిస్తున్న మూడో వ్యూహాత్మక రహదారి ఇది. మంచు కొండల మధ్య నుంచి వెళ్తుంది కాబట్టి పొరుగు దేశాలు నిమ్ము-పదమ్-దార్చా రహదారిని గుర్తించలేవని బీఆర్‌వో తెలిపింది. కాబట్టి సైనికులను సురక్షితంగా సరిహద్దులకు చేర్చడం వీలవుతుందని వెల్లడించింది.