News

చైనాతో ఘర్షణ సమయంలో సైన్యానికి పూర్తిస్వేచ్ఛ: నరవణె

93views

చైనాతో సైనిక ఘర్షణ తలెత్తినప్పుడు మన ప్రభుత్వం నుంచి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ లభించిందని, భద్రతకు ప్రమాదం వాటిల్లితే చైనా సైన్యంపై కాల్పులు జరిపేందుకు అనుమతించిందని మాజీ సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె స్పష్టం చేశారు. చైనాతో సంఘర్షణ సమయంలో ‘ఏది సముచితమైతే అది చేయండ’ని రక్షణ మంత్రి ద్వారా ప్రధాని తనకు చెప్పినట్లు ఆయన ఒక పుస్తకంలో రాయడం గతంలో రాజకీయ రాద్ధాంతానికి తావిచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు కూడా. తాజాగా నరవణె దీనిపై ఓ టీవీ ఛానెల్‌లో స్పందిస్తూ… నాడు కేంద్రం నుంచి తనకు అందిన ఆదేశాలు విస్పష్టంగా ఉన్నాయని, ఏకాకిలా ప్రభుత్వం వదిలేయలేదని చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, దళాల శక్తిసామర్థ్యాలు తనకు బాగా తెలుసు కాబట్టి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. తన పుస్తకంలో సంచలన, సున్నిత విషయాలేమీ లేవన్నారు. అయితే రాజకీయంగా, దౌత్యపరంగా ఎవరి దృక్కోణం వారికి ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ పుస్తకాన్ని తగిన అనుమతి కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించానని చెప్పారు.