ArticlesNews

వేదకాలం నుండి ఆధునిక కాలం వరకు మగువ

6views

భారతీయ మహిళ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, సహనం, శక్తి , సంస్కృతికి మారుపేరు. వేద కాలం నుండి నేటి అంతరిక్ష యుగం వరకు భారతీయ మహిళలు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేశారు. పూర్వకాలంలో అసలు మహిళలను గౌరవించలేదనీ, వారికి సమానమైన గౌరవం ఇవ్వలేదంటూ చాలామంది మూర్ఖులు వాదిస్తూ ఉంటారు కానీ మన చరిత్రలో గార్గి, మైత్రేయి వంటి మహిళలు వేద కాలంలోనే పురుషులతో సమానంగా మేధోపరమైన చర్చలు చేసేవారు. వారు విద్యకు, జ్ఞానానికి మహిళలు అతీతం కాదని ఆ కాలంలోనే నిరూపించారు.

లోపాముద్ర, విశ్వవార: వీరు స్వయంగా ఋగ్వేదంలోని శ్లోకాలను (రుక్కులను) రచించిన మంత్రద్రష్టలు. అందుకే మనం సావిత్రి దేవిని, గాయత్రిదేవిని జ్ఞానానికి ఆనవాలంగా చెబుతుంటాం. భారతీయ మహిళ కేవలం జ్ఞానానికి ప్రతీక మాత్రమే కాదు పరిపాలనలోనూ, ధైర్యంలోనూ పేరుగడించారు. ఝాన్సీరాణి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి రుద్రమ ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర పుటల్లో ఎందరెందరో వీర నారీమణులు ఉన్నారు. ఉదాహరణకు భారతదేశాన్ని పాలించిన రాణి అహల్యాబాయి హోల్కర్ కేవలం పాలకురాలిగానే కాకుండా, దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాలను పునరుద్ధరించిన గొప్ప ధర్మకర్తగా పేరుగాంచారు. ఆమె పాలనను “రామరాజ్యం”గా అభివర్ణిస్తారు.

ఇక నేటి ఆధునిక భారతీయ సమాజంలో మహిళ కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, కుటుంబాన్ని చక్కదిద్దడంలో, విలువలను తర్వాతి తరానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” (ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు) అన్నది మన సంస్కృతిలో భాగం.

ఆధునిక భారతంలో కూడా ఎందరోమంది మగువలు తమ తెగువను ప్రదర్శించారు. సైన్స్ లో చూస్తే మంగళయాన్ మరియు చంద్రయాన్ ప్రయోగాల్లో రీతూ కరిధాల్ వంటి ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ‘రాకెట్ ఉమెన్’గా కీర్తించబడుతున్నారు. ఇక క్రీడల్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ లాంటి ఎందరో ప్రపంచ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. రక్షణరంగంలో సైతం ఎందరో మహిళలు దేశ సరిహద్దులు కాపాడుతున్నారు. ఈ విషయంలో ఆపరేషన్ సిందూర్ గురించి మనందరికీ తెలిసిందే. ఇలా నాటి వేదకాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు మహిళ తన వంతుగా సమాజసేవలో భూమిక వహిస్తూ ఉంది.