చైనా నుంచి ఎదురయ్యే హైపర్‌సోనిక్ ఆయుధ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ కూడా మెల్లగా ముందడుగు వేస్తోంది. భవిష్యత్తులో యుద్ధతంత్రాన్ని శాసించే ఈ టెక్నాలజీలో కూడా భారత్ కీలక దశను దాటింది. ఇప్పటికే పొరుగున వున్న డ్రాగన్ చెంతకు ఈ టెక్నాలజీ చేరి కొన్నేళ్లవుతుంది. దీంతో భారత్ కూడా పావులు కదిపింది. ఫలితంగా నేడు భారత్ కూడా దీనిని విజయవంతంగా పరీక్షించింది.
ఏమిటీ హైపర్‌సోనిక్..?
ఏదైనా ఆయుధం శబ్ధవేగానికి ఐదు రెట్ల వేగంతో ప్రయాణిస్తే దానిని హైపర్‌సోనిక్‌గా ఆయుధంగా పేర్కొంటారు. అంటే మాక్ 5 స్పీడ్ అన్నమాట. ఈహైపర్‌సోనిక్ ఆయుధాల్లో బాలిస్టిక్ క్షిపణుల్లో ఉండే వేగం.. క్రూజ్ క్షిపణుల్లో వలే మార్గం మార్చుకొనే లక్షణాలు ఉంటాయి. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా భావిస్తారు. వీటిల్లో అత్యంత శక్తివంతమైన స్క్రాంజెట్ ఇంజిన్లను వాడటంతో విపరీతమైన వేగాన్ని అందుకొంటాయి. ఈ ఇంజిన్లు వాతావరణం నుంచి ఆక్సిజన్‌ను పీల్చుకొని దానిలోని హైడ్రోజన్ ఇంధనంతో కలిపి శక్తిని సృష్టిస్తాయి. దీని సాయంతో అవి మాక్5 స్పీడ్‌ను అందుకొంటాయి.
ఎందుకు వాడతారు..?
హైపర్‌సోనిక్ ఆయుధాలను ప్రత్యేక పరిస్థితుల్లో వినియోగిస్తారు. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణులను మార్గం మధ్యలోనే ధ్వంసం చేసే అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఛేదించుకొని లక్ష్యాలను ధ్వంసం చేయడానికి వినియోగిస్తారు. వీటి ద్వారా అణ్వాయుధాలను కూడా ప్రయోగించవచ్చు. సుదూర లక్ష్యాలను ఛేదించవచ్చు.
అమెరికా, రష్యా, చైనాలు ఎక్కడ..
2011లో అమెరికా విజయవంతంగా అడ్వాన్స్‌డ్ హైపర్‌సోనిక్ ఆయుధాన్ని పరీక్షించింది. ఇది 3,700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించింది. అమెరికాలోని లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ దీనిని అభివృద్ధి చేస్తోంది. చైనా, రష్యాలు కూడా ఈ టెక్నాలజీలో బాగా ముందంజలో ఉన్నాయి.
చైనా హైపర్ సోనిక్ గ్లైడెడ్ వెహికల్, హైపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్‌ను అభివృద్ధి చేస్తోంది. డీఎఫ్-జెడ్‌ఎఫ్ పేరుతో చేస్తున్న ఈ ఆయుధం మాక్10 వేగంతో ప్రయాణిస్తుందని చైనా చెబుతోంది. ఇది హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్‌గా పేర్కొంటోంది. ఇక రష్యా అవెంజర్డ్ పేరుతో హెచ్‌జీవీని అభివృద్ధి చేస్తోంది. ఇది మాక్20 వేగంతో ప్రయాణిస్తుందని చెబుతోంది. ఇదే కాకుండా కేహెచ్-47ఎం2 వంటి పలు రకాల ఆయుధాల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తోంది.
భారత్ గతంలో ప్రయోగించిందా..?
భారత్ కూడా గత ఏడాది హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్‌ను పరీక్షించినట్లు యూరేషియన్ టైమ్స్ వంటి పత్రికల్లో వార్తలొచ్చాయి. అగ్ని-1 క్షిపణి ప్లాట్‌ఫామ్‌పై చేసిన ఈ ప్రయోగం విఫలమైంది. తాజాగా నేడు చేసిన ప్రయోగం విజయవంతమైందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ట్విటర్‌లో ప్రకటించారు.
మరోపక్క జపాన్ కూడా దేశీయంగా ఇటువంటి హైపర్‌సోనిక్ ఆయుధం తయారీపై దృష్టిపెట్టింది. దీంతో ఆసియాలో హైపర్‌సోనిక్ ఆయుధపోటీ వేగవంతమైంది.
ఈనాడు సౌజన్యంతో….