News

“భారత్ మాతాకీ జై” అంటున్న టిబెటన్లు

594views

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద చైనా దూకుడుకు ముకుతాడు వేసేందుకు భారత్‌ సిద్ధమైంది. ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాలను మోహరించింది. ముఖ్యంగా చైనాకు తగిన సమాధానం ఇచ్చేందుకు స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌)ను రంగంలోకి దించింది. ఇప్పటికే వారిని తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇలా సరిహద్దులకు వెళుతున్న ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ సైనికులకు సిమ్లాలోని టిబెటన్లు వీడ్కోలు పలికారు. టిబెట్‌, భారత్‌ జెండాలను చేత బూని ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినదించారు. సైనికుల మెడలో తెల్లటి వస్త్రాలు కప్పి సరిహద్దులకు సాగనంపారు. భారత్‌- టిబెట్‌ స్నేహ బంధాన్ని గుర్తుచేస్తూ పాటలు పాడారు. చైనా చొరబాట్లను అడ్డుకునేందుకు తమ సోదరులు భారత్‌ తరఫున పోరాడేందుకు వెళుతుండడం సంతోషంగా ఉందని ఒక టిబెటన్‌ పేర్కొన్నారు.

టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్న అనంతరం వేలాదిమంది టిబెటన్లు భారత్‌లోకి శరణార్థులుగా వచ్చారు. దాంతో భారత్‌లో ఉంటున్న టిబెటన్లు చైనా అణచివేతను ఏళ్లుగా నిరసిస్తూ వస్తున్నారు. 1962 చైనాతో యుద్ధం అనంతరం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌లో టిబెటన్లు, గూర్ఖాలు ప్రధానంగా ఉన్నారు. పర్వత ప్రాంతాల్లో ఎలాంటి ఆపరేషన్లనయినా సులువుగా నిర్వహించే సత్తా వీరి సొంతం. పైగా చైనా దళాలు వీరితో ఢీకొట్టడానికి వెనుకడుగు వేస్తాయి. దీంతో కేంద్రం ఈ సైన్యాన్ని వ్యూహాత్మకంగా రంగంలోకి దింపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.