News

చైనాలో విజృంభిస్తున్న వైరస్ లు

218views

చైనాలో మరో కొత్త వ్యాధి ప్రబలింది. కరోనావైరస్‌ తర్వాత ఇది ప్రమాదకర స్థాయిలో ప్రజలకు సోకుతోంది. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌ పేర్కొంది. ఎస్‌ఎఫ్‌టీఎస్‌ వైరస్‌ (నావెల్‌ బునియా) చైనాలోని తూర్పు ప్రాంతంలో వ్యాపించింది. ఇప్పటికే ఏడుగురు చనిపోగా.. దాదాపు 60 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. దేశంలోని తూర్పు జియాంగ్స్‌ ప్రావిన్స్‌ రాజధానిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో 37 మందికి ఈ వైరస్‌ సోకింది. ఆ తర్వాత తూర్పు చైనాలోనే అన్హోయ్‌ ప్రావిన్స్‌లో మరో 23 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో దాదాపు ఏడుగురు మృతి చెందారు.

తొలుత జియాంగ్సూ ప్రావిన్స్‌లోని నాన్జింగ్‌లో ఓ మహిళకు ఈ వైరస్‌ సోకింది. తీవ్రమైన జ్వరం, దగ్గుతో ఆసుపత్రిలో చేరింది. ఆమెలో తెల్లరక్తకణాలు బాగా తగ్గిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దాదాపు నెలరోజుల పాటు చికిత్సనందించి డిశ్చార్జి చేశారు. ఈ ఎస్‌ఎఫ్‌టీఎస్‌ వైరస్‌ కొత్తదేమీ కాదు. దీనిని 2011లోనే చైనా కనుగొంది. ఇది బునియా వైరస్ కేటగిరీకి చెందినదిగా వర్గీకరించింది. ఇది ‘టిక్’ అనే పురుగు(నల్లి వంటిది) ద్వారా మనుషులకు సోకుతుంది. అక్కడి నుంచి మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఇది రక్తం, కళ్లె నుంచి ఇతరులకు సోకుతుందని ఝియాంగ్‌ యూనివర్శిటీ వైద్యులు తెలిపారు. కానీ టిక్‌ అనే పురుగు కుడితేనే ఈ వ్యాధి వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువగా ఉండటంతో ఈ వ్యాధి చైనా నుంచి అంతతేలిగ్గా వ్యాపించే అవకాశం లేదని భావిస్తున్నారు.

విచ్చలవిడిగా వైరస్‌లు..

చైనాలో గత కొంత కాలంగా విచ్చలవిడిగా వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. అక్కడ పుట్టిన కరోనావైరస్‌ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుండగా.. అదే సమయంలో హంటా వైరస్‌ వ్యాపించింది. ఆ తర్వాత చైనాలో బుబోనిక్‌ ప్లేగుకు సంబంధించిన కొన్ని కేసులను అక్కడి ఆసుపత్రులు నిర్ధరించాయి. ఇన్నర్‌ మంగోలియా అటానమస్‌ రీజియన్‌లోని బైయన్నూరు ప్రాంతంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకింది. వీరిని వేర్వురు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందించారు. అప్పట్లో ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక పీపుల్స్‌ డెయిలీ వెల్లడించింది. దీంతో ఆ ప్రాంతంలో ఈ ఏడాది చివరి వరకు లెవల్‌-3 హెచ్చరికను జారీ చేశారు. ముర్మోట్‌ అనే ఉడుత జాతి జంతువు మాంసం తినడం వల్ల బుబోనిక్‌ సోకినట్లు భావిస్తున్నారు. దీంతో ఆ మాంసం తినొద్దని హెచ్చరికలు జారీ చేశారు. గతంలోనూ సార్స్‌ కోవ్‌2 గబ్బిలం మాంసం వల్లే వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. బుబోనిక్‌ ప్లేగును గుర్తించి వైద్యం చేయకపోతే 24 గంటల్లో మనిషి ప్రాణం తీయగలదు.

అంతకు ముందు జీ4 వైరస్‌..

అంతకుముందు చైనాలో సరికొత్త వైరస్‌ జీ4 ప్రజలకు సోకుతున్నట్లు వార్తలు వెల్లువెత్తాయి. ఈ సరికొత్త స్వైన్‌ఫ్లూ వైరస్‌ అత్యంత ప్రమాదకరమని చైనాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఒకటి పీఎన్‌ఏఎస్‌ అమెరికా జర్నల్‌లో కొన్నాళ్ల కిందటే ప్రచురించింది. జీ4 మనుషులకు వేగంగా వ్యాపించగలదని, మహమ్మారిగా మారే సామర్థ్యం ఉందని హెచ్చరించింది. అయితే ఈ అధ్యయనాన్ని చైనా ఖండించింది.

Source : Enadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.