
ఉగ్రవాదులొచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుంటే ఎవరైనా ఏం చేస్తారు? బిక్కచచ్చిపోతారు. ఎక్కడైనా దాక్కోవడానికో, పారిపోవడానికో ప్రయత్నిస్తారు. కానీ ఆ బాలిక ఏ మాత్రం భయపడలేదు. దాదాపు 40 మంది ఉగ్రవాదులపైకి శివంగిలా లంఘించింది. తుపాకి పట్టుకుని ధనాధన్‌మంటూ తూటాలు కురిపించింది. ఆమె కాల్పుల ధాటికి ముగ్గురు ముష్కరులు మట్టికరిచారు. అఫ్గానిస్థాన్‌లోని సెంట్రల్‌ఘర్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో ఇటీవల ఈ సంఘటన జరిగింది.
ఈ సాహస బాలిక పేరు కమర్‌గుల్. వయసు 15-16 ఏళ్లు ఉంటుంది. ఆమె తండ్రి గ్రామపెద్ద. ప్రభుత్వానికి మద్దతుదారు. ఇది తాలిబన్లకు రుచించలేదు.
అతన్ని చంపడానికి ఈ నెల 17న అర్ధరాత్రి ఉగ్రవాదులు వచ్చారు. ఒంటిగంట సమయంలో కమర్‌గుల్ ఇంటి తలుపు తట్టారు. వచ్చింది ఎవరో చూడడానికి కమర్ వాళ్లమ్మ తలుపు తీసింది. ఉగ్రవాదులని అర్థం కాగానే లోపలికి రాకుండా అడ్డుకుంది.
దీంతో వారు ఆమెను కాల్చి చంపి లోపలకు ప్రవేశించారు. అక్కడ కమర్ తండ్రిని కాల్చి చంపారు. తల్లిదండ్రులను తన కళ్లెదుటే ఉగ్రవాదులు కాల్చి చంపడంతో తట్టుకోలేకపోయిన కమర్ శివంగిలా దూకింది. ఇంట్లో ఉన్న ఏకే47 తుపాకీ తీసుకుని ముగ్గురు ముష్కరులను కాల్చిపారేసింది.
అంతటితో ఆగలేదు. తనను చంపడానికి ప్రయత్నిస్తున్న మిగిలిన ఉగ్రవాదులతో గంట పాటు భీకరంగా పోరాడింది. ఆమె కాల్పుల ధాటికి పలువురు గాయపడ్డారు. ఆమె పక్కనే 12 ఏళ్ల సోదరుడున్నాడు.
తమ్ముడిని కాచుకుంటూనే, అక్కడా ఇక్కడా దాక్కుంటూనే ఆమె అసమాన పోరాటం చేసింది. ఇంతలో గ్రామస్థులు, ప్రభుత్వ అనుకూల మిలిటెంట్లు ఆమెకు సహాయంగా వచ్చి ముష్కరులపై కాల్పులు ప్రారంభించారు. దాంతో వారు పారిపోయారు. కమర్ సాహసాన్ని అఫ్గాన్ ప్రభుత్వం ప్రశంసించింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని.. అక్కా తమ్ముళ్లను తన భవనానికి ఆహ్వానించారు.