News

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో చైనా దూకుడుకు కళ్ళెం

1.2kviews

క్య రాజ్య సమితి భద్రతా మండలిలోనూ దుందుడుకు చైనాకు చుక్కెదురైంది! అమెరికా, జర్మనీ ఆ దేశంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఊహించని విధంగా భారత్‌కు నిశ్శబ్దంగా మద్దతు ప్రకటించాయి.

రెండు రోజులు క్రితం కరాచీలోని పాకిస్థాన్‌ జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ భవనంపై కొందరు సాయుధులు దాడి చేశారు. కారులో వచ్చిన నలుగురు దుండగులు భవనంపై గ్రెనేడ్‌ విసిరారు. ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మొత్తం 11 మృతిచెందారు. ఈ దాడిని ఖండిస్తూ, పాకిస్థాన్‌కు మద్దతుగా చైనా ఓ ముసాయిదాను భద్రతా మండలిలో ప్రవేశపెట్టింది. పాక్‌కు ప్రతిదేశం సహకరించాల్సిందిగా కోరింది.

ప్రకటన ముసాయిదాను మంగళవారం చైనా మండలిలో ప్రవేశపెట్టింది. ఏదైనా ముసాయిదాను ఆమోదించేందుకు మండలిలో ఓ పద్ధతి ఉంటుంది. ఒక గడువు నిర్ణయించి ఆలోపు ఏ సభ్యదేశం నుంచీ వ్యతిరేకత రాకపోతే ఆమోదించినట్టుగా భావిస్తారు. చైనా ముసాయిదా ఆమోదానికి న్యూయార్క్‌ కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలు తుదిగడువుగా నిర్ణయించారు.

అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న జర్మనీ సాయంత్రం 4 గంటలకు జోక్యం చేసుకుంది. కరాచీ దాడికి భారత్‌ను నిందిస్తూ పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఎస్‌ఎం ఖురేషీ చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యంకాదని తెలిపింది. నిర్దేశిత గడువు ముగిసిందని చైనా దౌత్యవేత్త మొత్తుకున్నా జర్మనీ వినలేదు. దాంతో ఆ గడువును జులై 1, ఉదయం 10 గంటలకు పొడగించారు.

పొడగించిన గడువు మరో గంటలో ముగుస్తుందనగా ఈ సారి అమెరికా జోక్యం చేసుకుంది. దీంతో పాక్‌కు మద్దతుగా చేయాల్సిన ఖండన తీర్మానం ఆలస్యమైంది. చివరికి ఎలాగోలా ముసాయిదాకు ఆమోదం పలకడంతో ఖండన ప్రకటన విడుదలైంది. అనేక అంశాల్లో చైనా వైఖరిపై అంతర్జాతీయంగా అసంతృప్తి ఉందని చెప్పేందుకు భద్రతామండలిలో పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.