News

అయోధ్య రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన

1.6kviews

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఈరోజు అనగా బుధవారం (జూన్ 10) శంకుస్థాపన జరిగింది. రామమందిర పరిధిలోని కుబేర్ తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రుద్రాభిషేకంతో భూమిపూజ కార్యక్రమం ప్రారంభమైనట్టు శ్రీరామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయినట్టు పేర్కొన్నారు. బుధవారం ఉదయం రుద్రాభిషేకంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమైనట్టు శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్ తెలిపారు. శివుడికి రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్ని తాము అనుసరిస్తున్నామని ఆయన వెల్లడించారు.

కుబేర తిల ఆలయం చాలా పురాతన శివాలయమని రామభక్తుడు త్రిలోకి నాథ్ పాండే అన్నారు. ఉదయం 8 గంటలకు శివాలయంలో పూజలు ప్రారంభించగా 10 గంటల వరకు కొనసాగాయి. మహంత్ కమల్ నయన్ దాస్, ఇతర పూజారులు కలిసి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు మే 21న, అయోధ్యలోని రామ జన్మభూమి వద్ద భూమి చదును పనులు జరుగుతుండగా పురాతన విగ్రహాలతో పాటు శివలింగం, ఇసుకరాయిపై చెక్కడాలు బయటపడ్డాయి. రామమందిర ప్రదేశంలో తవ్వకాల సమయంలో అనేక పురాతన శిల్పాలు వెలుగుచూసిన సంగతి పాఠకులకు విదితమే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.