News

15 రోజులలో వారిని గమ్యస్థానాలకు చేర్చండి – సుప్రీంకోర్టు

581views

లస కార్మికుల తరలింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేవలం 15 రోజులు సరిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. వారందర్నీ 15 రోజుల్లో వారి గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించింది.
వలస కార్మికుల తరలింపుపై దాఖలైన పిల్‌ను సుమోటోగా తీసుకున్న జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్కే కౌల్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారించి ఈ మేరకు తీర్పు వెలువరించింది. 15 రోజుల్లోనే వలస కార్మికులందరినీ వారి సొంత రాష్ట్రాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తరలించాలని పేర్కొంది.
వలస కార్మికులకు అవసరమైన భోజన ఏర్పాట్లు, ఉపాధి లాంటి రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలపాలని, వలస కార్మికుల కోసం రికార్డును నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు కోటి మంది వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు తరలించిందని ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రోడ్డు మార్గం గుండా 41 లక్షల మందిని, రైలు ద్వారా 57 లక్షల మందిని తరలించినట్లు వివరించారు. ఢిల్లీలో ఇప్పటికీ రెండు లక్షల మంది వలస కూలీలు ఉన్నారని, అయితే, వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సుముఖత చూపడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ కోర్టుకు తెలిపారు. మరో 10వేల మంది మాత్రం తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. యూపీ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపింది. ఉత్తరప్రదేశ్ లోని 1.35 లక్షల మంది వలస కూలీలను ఆయా రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు యూపీ తరపు న్యాయవాది పీఎస్ నర్సింహ కోర్టుకు తెలిపారు. ఇందుకు 104 రైళ్లు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. 5.50 లక్షల మంది కూలీలను ఢిల్లీ నుంచి యూపీకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను తీసుకొచ్చేందుకు

10వేలకుపైగా బస్సులను ఉపయోగించినట్లు తెలిపారు. 1664 శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో 21.69 లక్షల మందిని రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.