
ఆరోగ్యసేతు యాప్‌లోని మూడు భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన బగ్స్ కనిపెట్టి చెప్పిన వారికి రూ.లక్ష చొప్పున రూ.3 లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ డైరెక్టర్ జనరల్ నీతా వర్మ ప్రకటించారు. యాప్ ఓపెన్‌సోర్స్ కోడ్ విడుదల సందర్భంగా మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దీంతో పాటు కోడ్ మెరుగుదలకు మంచి సూచనలు చేసిన వారికి మరో రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ రంగంలో ఒక యాప్‌కు సంబంధించి బహుమతి ప్రకటించడం ఇదే తొలిసారన్నారు. ఆరోగ్యసేతు యాప్‌ను పూర్తిగా ఓపెన్‌సోర్స్ ప్లాట్‌ఫాంగా అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఈపాస్ జారీ చేస్తే అది ఈ యాప్‌తో అనుసంధానం అవుతుందని, ప్రత్యేకంగా పాస్ కాపీ పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ డెలివరీ బాయ్స్ అంతా ఈ యాప్ ఉపయోగించాలని చెప్పామని ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌సాహ్ని చెప్పారు. ఐసీఎంఆర్ ల్యాబ్‌లలో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మాత్రమే ఆరోగ్యసేతు యాప్‌లో ఎరుపు రంగు కనిపిస్తుందన్నారు. లేత ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్ రంగులు కేవలం హెచ్చరిక సంకేతాలని, వాటిని వినియోగదారులు గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.





