
హిందూ ధార్మిక సంస్థల ఆదాయం నుంచి కామన్ గుడ్ ఫండ్‌కు సమకూరే నిధుల్లో 2 శాతం మొత్తాన్ని హిందూ ధర్మ కార్యకలాపాల కోసం హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్‌కు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ నిధుల కేటాయింపునకు సంబంధించిన జీవోలోని నిబంధనను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
2015 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 927లోని క్లాజ్ 7(2)(బీ) ప్రకారం కామన్ గుడ్ ఫండ్‌కు వచ్చే ఆదాయంలో 2 శాతం మొత్తాన్ని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్‌కు కేటాయించాలని నిర్ణయించింది.అయితే చట్టబద్ధంగా ఏర్పాటుకాని ట్రస్ట్‌కు ప్రభుత్వ నిధులు కేటాయించడం సరికాదంటూ నరేష్ కుమార్ అనే వ్యక్తి 2018లో ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆయన వాదనలతో ఏకీభవిస్తూ జీవోలోని సంబంధిత క్లాజును కొట్టివేసింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రస్ట్
హైకోర్టు విచారణలో తమను ప్రధాన ప్రతివాదిగా చేర్చకుండా తీర్పు వెలువరించారని పేర్కొంటూ హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ట్రస్ట్ తరఫున న్యాయవాది ఎంవీకే మూర్తి వాదనలు వినిపిస్తూ.. 2009 ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 152 ప్రకారం హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్ ఏర్పాటైందని వివరించారు. దేవాదాయశాఖ మంత్రి ట్రస్ట్‌కు చైర్మన్‌గా, ఆ శాఖ కమిషనర్ కార్యదర్శిగా వ్యవహరిస్తారని తెలిపారు. కాబట్టి ఈ సంస్థ చట్టవిరుద్ధంగా ఏర్పాటైనది కాదని స్పష్టం చేశారు.
2 శాతం నిధుల కేటాయింపునకు ప్రభుత్వం మద్దతు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ప్రేరణాసింగ్ వాదనలు వినిపిస్తూ.. హిందూ ధర్మ ప్రచారం, పరిరక్షణ కార్యక్రమాల కోసం ట్రస్ట్‌కు నిధులు కేటాయించాలనే ఉద్దేశంతోనే జీవో జారీ చేసినట్లు తెలిపారు.ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చినప్పటి నుంచి ట్రస్ట్‌కు ఎలాంటి నిధులు కేటాయించలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటని జస్టిస్ పి.ఎస్. నరసింహ ప్రశ్నించారు. దీనికి స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. 2 శాతం నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.





