
ఉత్తరప్రదేశ్: దేశభక్తిని చాటే ‘వందేమాతరం’, ‘జైహింద్’, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పేరును ఇంటి నేమ్‌ప్లేట్‌పై రాయించుకోవడంపై వివాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటిపై ఉన్న ఈ పదాలను అభ్యంతరకరంగా భావించిన స్థానిక మసీదు ఇమామ్, ఆ కుటుంబానికి చెందిన యువతి నికాహ్ నిర్వహించేందుకు నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
నికాహ్కు నిరాకరించిన ఇమామ్
రోజా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్మౌలా అర్జున్‌పూర్ గ్రామానికి చెందిన న్యాయవాది మోనిష్ తన సోదరి వివాహాన్ని నవంబర్ 15న నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం 15 రోజుల ముందుగానే స్థానిక మసీదు ఇమామ్ మహమ్మద్ సుర్ఫాన్ రజా ఖాద్రీని సంప్రదించారు.అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు ఇమామ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని మోనిష్ ఆరోపించారు. కుటుంబ సభ్యులు చేస్తున్న కొన్ని పనులు మతానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ నికాహ్ నిర్వహించేందుకు నిరాకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇమామ్ నిరాకరించడంతో కుటుంబ సభ్యులు మరో ఖాజీని సంప్రదించి వివాహ వేడుకను నిర్వహించారు.
‘వందేమాతరం’, ‘జైహింద్’ నినాదాలపై వివాదం
తన పేరుకు ముందు భగత్ సింగ్ అని రాసుకుంటానని, జైహింద్, వందేమాతరం నినాదాలు చేస్తానని మోనిష్ వెల్లడించారు. తన ఇంటి నేమ్‌ప్లేట్‌పై కూడా ఈ పదాలను రాయించుకున్నట్లు తెలిపారు.వీటిపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ తాను పట్టించుకోలేదని చెప్పారు. దేశభక్తి, జాతీయ భావజాలం, భారతీయ సంప్రదాయాల పట్ల తనకున్న గౌరవం కారణంగానే ఇలాంటి పదాలను ఉపయోగిస్తున్నానని పేర్కొన్నారు.
ఇమామ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
ఈ వ్యవహారంపై న్యాయవాది మోనిష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇమామ్ మహమ్మద్ సుర్ఫాన్ రజా ఖాద్రీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం.





