
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఐ.సి.టి.ఎస్. మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ‘మిషన్ సాహసి’ పేరుతో మహిళా సాధికారత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళల ఆత్మరక్షణలో కరాటే ప్రాధాన్యతను వివరిస్తూ శిక్షణ పొందిన విద్యార్థినులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరాటే మాస్టర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈవ్ టీజింగ్ వంటి వేధింపులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టికల్‌గా ప్రదర్శించారు. ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మరక్షణపై అవగాహనను పెంపొందించింది.
కళాశాల ప్రిన్సిపల్ బి. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో కళాశాల చైర్మన్ ఉపేంద్రరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థినులు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకుని ధైర్యసాహసాలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, విద్యార్థినుల కోసం శుక్రవారం నుంచి కళాశాలలో ప్రత్యేకంగా కరాటే శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.
ఐ.సి.టి.ఎస్. కళాశాల వైస్ చైర్మన్ అనూషారెడ్డి మాట్లాడుతూ.. ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ప్రధాన అధ్యక్షురాలు పద్మావతి, డాక్టర్ స్నేహ మాట్లాడుతూ.. విద్యార్థినులు తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ సత్య, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పూర్ణ జగదీష్, ఎస్.ఎఫ్.డి. కన్వీనర్ వినయ్, రాజానగరం యూనిట్ ఉపాధ్యక్షుడు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
మహిళల భద్రత, ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసమే లక్ష్యంగా నిర్వహించిన ‘మిషన్ సాహసి’ కార్యక్రమం విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చింది.





