News

శుద్ధి ఉద్యమపు ధీరోదాత్త నాయకుడు స్వామి శ్రద్ధానంద: దత్తాత్రేయ హొసబళే

7views

ఇందోర్‌లో 2026 నవంబర్ 2,3,4 తేదీల్లో జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండల్ సమావేశాల్లో భాగంగా శుద్ధి ఉద్యమ నాయకుడు స్వామి శ్రద్ధానంద అమరులై నూరేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆ మేరకు మాననీయ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబళేజీ ఒక ప్రకటన చేసారు.

స్వామి శ్రద్ధానందజీ స్వాతంత్ర్య సమర యోధుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త, ధర్మ బోధకుడు, వాటన్నింటినీ మించి శుద్ధి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ధీరోదాత్త నాయకుడు. ఆయన అమరులై నూరేళ్ళు గడిచిన సందర్భంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆయనను గౌరవ పురస్సరంగా స్మరించుకుంటోంది.

స్వామి శ్రద్ధానంద పంజాబ్‌లోని జలంధర్ జిల్లా తల్వాన్ గ్రామంలో జన్మించారు. సన్యాస ఆశ్రమం స్వీకరించాక ఆయన సమాజాన్ని మేల్కొలిపే ప్రయత్నాలకు తన జీవితాన్ని అంకితం చేసారు.

భారతీయ విద్యా విధానం మీద బ్రిటిష్ ప్రభుత్వం వ్యవస్థీకృతంగా చేసిన దాడులను స్వామి శ్రద్ధానంద ధైర్యంగా ప్రతిఘటించారు. ఆ క్రమంలోనే ఆయన హరిద్వార్ ప్రాంతంలో కాంగ్రీ గురుకులం ఏర్పాటు చేసారు. భారతీయ దృష్టితో విద్యను అందించే ప్రత్యామ్నాయ సంస్థగా దాన్ని తీర్చిదిద్దారు. భారతీయ సంస్కృతి, వేదాలు, భారతీయ సాహిత్యంతో పాటు సమకాలీన ఆధునిక పాఠ్యాంశాల బోధనతో పాటు కాంగ్రీ గురుకులం స్వతంత్ర పోరాటానికి గుర్తించదగిన స్థాయిలో పాటుపడింది.

కేరళలోని వైకోంలో శివాలయం ఉంది. కొన్ని వర్గాల దురభిప్రాయాలు, పక్షపాత ధోరణుల కారణంగా ఆ ఆలయంలోకి వెనుకబడిన కులాల వారికి ప్రవేశం లేకుండా చేసారు. అంతేకాదు. గుడి చుట్టూ ఉండే రహదారులను సైతం వారు వాడుకోడానికి వీల్లేదనే ఆంక్షలు ఉండేవి. ఆ వివక్షకు వ్యతిరేకంగా వైకోంలో చరిత్రాత్మక ఉద్యమం ప్రారంభమైంది, జాతీయస్థాయిలో గణనీయమైన ప్రాధాన్యం లభించిన ఆ ఉద్యమంలో స్వామి శ్రద్ధానంద స్వయంగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన శ్రీ నారాయణ గురును కూడా కలుసుకున్నారు.

సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో స్వామి శ్రద్ధానంద క్రియాశీలంగా పాల్గొనడాన్ని భారతరత్న డా. బి.ఆర్ అంబేడ్కర్ గమనించారు. సామాజికంగా, ఆర్థికంగా బలహీనమైన వర్గాల సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిగా ఆయనను ప్రశంసించారు.

స్వతంత్ర సమరం సమయంలో సమాజాన్ని జాగృతం చేయడానికి స్వామి శ్రద్ధానంద ఎన్నో పత్రికలు, సంచికలూ ప్రారంభించారు. సద్ధర్మ ప్రచార్, తేజ్, వీర్ అర్జున్, ది లిబరేటర్ వంటి పత్రికల ద్వారా ఆయన నియమబద్ధుడైన, భయరహితుడైన పాత్రికేయుడిగా పనిచేసారు. బ్రిటిష్ ప్రభుత్వపు తప్పుడు ప్రచారాలూ కుట్రలను ఆయన వెలుగులోకి తెచ్చేవారు.

ప్రతికూల పరిస్థితులు, తప్పుదోవ పట్టిన సామాజిక ధార్మిక విశ్వాసాల కారణంగా హిందూ సమాజం నిరంతరాయంగా మతమార్పిడుల సవాల్‌ను ఎదుర్కొంటుండేది. మతం మారి హిందూధర్మం నుంచి బైటకు వెళ్ళిపోయిన వారికి వెనక్కు రావడానికి లేకుండా అన్ని తలుపులూ మూసుకుపోయాయి. అలాంటి పరిస్థితుల్లో, మతం మారిన హిందువులు తమ పూర్వీకుల ధర్మంలోకి మళ్ళీ రావడానికి వీలు కల్పిస్తూ స్వామీజీ శుద్ధి ఉద్యమం ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. మోప్లా ఊచకోత తరువాత స్వామీజీ శుద్ధి ఉద్యమానికి నేతృత్వం వహించారు. కేరళలోనూ, మిగతా దేశంలోనూ వేలమంది మళ్ళీ హిందూధర్మంలోకి రావడానికి మార్గం సుగమం చేసారు.

పురుషార్థాన్నీ, పరమార్థాన్నీ సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన స్వామీజీ, హిందువులను మతం మార్చే తమ ప్రయత్నాలకు అడ్డుపడుతుండడం ప్రత్యర్థి వర్గాన్ని కలవరానికి గురిచేసింది. 1926 డిసెంబర్ 23న అబ్దుల్ రషీద్ అనే మతోన్మాది ఢిల్లీలో స్వామి శ్రద్ధానందను దారుణంగా హత్య చేసాడు.

అంకితభావంతో, ప్రయోజనపూర్వకమైన కార్యాచరణకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిన స్వామి శ్రద్ధానందజీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తోంది. ఆయన జీవితం, కార్యాచరణ నుంచి ప్రేరణ పొంది, ధర్మ రక్షణ కోసం క్రియాశీలంగా పనిచేయాలంటూ ప్రజలందరికీ సంఘం పిలుపునిస్తోంది.