News

వరుస ఆవుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

41views

జల్సాలకు అలవాటు పడి వరుస ఆవుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2.22 లక్షల నగదు, రెండు ఆవులను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా గుర్రంకొండ స్థానిక ఎస్సై తిప్పేస్వామి వెల్లడించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిందితుల అరెస్టును చూపించారు.

పోలీసుల కథనం మేరకు.. గుర్రంకొండ, వాల్మీకిపురం పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన వరుస ఆవుల దొంగతనాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలకు సంబంధించి వాల్మీకిపురం పోలీస్‌స్టేషన్‌లో నాలుగు, గుర్రంకొండ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదయ్యాయి. దర్యాప్తులో భాగంగా పాతకోటపల్లికి చెందిన జంగం అరవింద్‌ అలియాస్‌ అను (28), ఎగువ బూడిదవేడు గ్రామానికి చెందిన కోట సిద్ధార్థ అలియాస్‌ సిద్ధు (30) ఈ దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు.

వీరిద్దరూ నగిరిమడుగు సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2.22 లక్షల నగదు, రెండు ఆవులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు.

కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్సై తిప్పేస్వామి అభినందించారు.