News

ధర్మ పరిరక్షణ కోసం జీవితాన్నే త్యాగం చేసిన స్వామి లక్ష్మణానంద సరస్వతి: దత్తాత్రేయ హొసబళే

5views

ఇందోర్‌లో 2026 నవంబర్ 2,3,4 తేదీల్లో జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండల్ సమావేశాల్లో భాగంగా స్వామి లక్ష్మణానంద సరస్వతి శతజయంతి సంవత్సరం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆ మేరకు మాననీయ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబళేజీ ఒక ప్రకటన చేసారు.

జగన్నాథ స్వామి ఆశీస్సులతో తరించిన ఒడిశా పుణ్యభూమిలో జన్మించి సమాజానికి మార్గదర్శనం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అటువంటివారిలో అగ్రగణ్యులు స్వామీ లక్ష్మణానంద సరస్వతీజీ. 1926 ఆగస్టు 15న ఒడిశా అంగుల్ జిల్లా గురుజాంగ్ గ్రామంలో పుట్టిన లక్ష్మణానంద సరస్వతీ స్వామి హిందూ సమాజ వ్యతిరేక శక్తులను ధైర్యంగా ఎదుర్కొంటూ ఆ క్రమంలో వారి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

స్వామీజి యువకుడిగా ఉండేటప్పుడు ప్రజామండలిలో చేరి, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. వివాహం తర్వాత ఆధ్యాత్మిక దీక్ష చేపట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. హిందూ ధార్మిక గ్రంథాలను, సంస్కృత వ్యాకరణాన్నీ నిశితంగా అధ్యయనం చేసారు.

ఒడిశా కంధమాల్ జిల్లాలో స్థానికంగా క్రియాశీలంగా పనిచేస్తున్న దేశవ్యతిరేక శక్తులతో పోరాడాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఆ ప్రాంతంలోని చక్‌పదా వద్ద ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక గిరిజనులను ఆధ్యాత్మికత పునాదుల మీద భౌతిక ప్రపంచంలో అభ్యున్నతి సాధించేందుకు, వారిలో తమ స్వీయ సంస్కృతి పట్ల అభిమానాన్ని మేలుకొలిపేందుకు సువిస్తరంగా ప్రయత్నాలు చేసారు. సంస్కృత విద్య, మహిళా భజన బృందాలు, వ్యవసాయం, పశుపాలన, జల సంరక్షణ వంటి కార్యక్రమాల ద్వారా కంధమాల్ జిల్లాలోని గిరిజన ప్రజలకు ఆత్మగౌరవాన్నీ స్వయంసమృద్ధినీ సాధించే మార్గాన్ని చూపించారు. శుద్ధి యజ్ఞాల నిర్వహణ ద్వారా, గిరిజన తెగలను ధర్మబద్ధమైన ప్రవర్తనను అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేసేలా ప్రేరేపించారు.

ఒడిశా గిరిజనులకు పవిత్ర ప్రతీక అయిన ‘ధరణి పెను’ను పూజించే విధానాలు ప్రవేశపెట్టడం ద్వారా స్వామీజీ సమాజ మూలాలను బలోపేతం చేసారు.

జగన్నాథ క్షేత్రానికి తీర్థయాత్రలు, యజ్ఞయాగాదుల నిర్వహణ ద్వారా స్వామి లక్ష్మణానంద సరస్వతి స్థానిక గిరిజన సమాజాన్ని ధార్మిక మార్గానికి కట్టుబడి ఉండేలా చేసారు, తమ సంప్రదాయాల పట్ల గర్వం కలిగి ఉండేలా వారిలో ఆత్మగౌరవం కలిగించారు. ఆ లక్ష్యంతో ఆయన భగవాన్ జగన్నాథుడి నిర్మాల్యాన్ని, తులసి ఆకులను, గంగాజలాన్నీ ఉపయోగించి హిందూధర్మంలోకి తిరిగి వచ్చే ప్రక్రియను సరళతరం చేసారు.

కంధమాల్ ప్రాంతంలో అడ్డూఅదుపూ లేకుండా పేట్రేగిపోతున్న సంఘవ్యతిరేక, దేశవ్యతిరేక శక్తుల్లో స్వామీజీ కృషి, ప్రయత్నాల కారణంగా అశాంతి పెరిగిపోయింది. వారు ఆయనపై ప్రత్యక్ష దాడులకు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసారు. అయినా స్వామీజీ ఎంతమాత్రం వెనుకంజ వేయలేదు. మరింత దృఢసంకల్పంతో తన పనిని కొనసాగించారు. తన ఉనికిని బలంగా చాటుకుంటూ ఎలాంటి అంతరాయాలూ లేకుండా తన కార్యాన్ని ముందుకు నడిపించారు.

చివరికి, పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున, అసహనపూరితమైన ఉన్మాద శక్తులు జలేశపట్ట ఆశ్రమంపై దాడి చేసాయి. నలుగురు శిష్యులతో సహా స్వామీజీని దారుణంగా హత్య చేసారు.

స్వామి లక్ష్మణానంద సరస్వతి తన జీవితం అంతటినీ మాతృభూమి రక్షణ, ధర్మ పరిరక్షణకే అంకితం చేసారు. ఆ పవిత్ర కార్యమే ఆయన జీవితపు పరమ ప్రయోజనంగా నిలిచింది. ఆయన వ్యక్తిత్వాన్నీ, ఆయన కార్యాచరణనూ విడదీసి చూడడం సాధ్యం కాదు. అవి దృఢ విశ్వాసం, కార్యాచరణలో అచంచలమైన ఐక్యతను ప్రతిబింబించాయి.

స్వామి లక్ష్మణానంద సరస్వతి మహోన్నత త్యాగం నుంచి ప్రేరణ పొంది, దాని స్ఫూర్తిని హృదయాలలో నింపుకొని, ఎంతోమంది వ్యక్తులు ఇవాళ పనిచేస్తున్నారు. ధార్మిక విశ్వాసాన్ని బలోపేతం చేయడం, సంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి కట్టుబడి ఉన్నారు.

పరమ పూజనీయ ‘వేదాంత కేసరి’ బిరుదాంకిత స్వామీ లక్ష్మణానంద సరస్వతీజీ శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆ మహనీయ సాధువుకు, అమర వీరుడికి వినమ్రంగా నివాళులు అర్పిస్తోంది.