
ఇందోర్‌లో 2026 నవంబర్ 2,3,4 తేదీల్లో జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండల్ సమావేశాల్లో భాగంగా, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు రాజ్‌నారాయణ్ బసు ద్విశతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆ మేరకు మాననీయ సర్కార్యవాహ దత్తాత్రేయ హొసబళేజీ ఒక ప్రకటన చేసారు.
భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్య సమర పోరాటం గొప్ప అధ్యాయం. బ్రిటిష్ ప్రభుత్వపు దమనకాండను ఎదుర్కొని దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేసారు. జాతి ఆత్మగౌరవం లుప్తమైపోయేలా బ్రిటిష్‌వారు చేసిన మేధో దాడి కారణంగా మన విద్యా వ్యవస్థ దాని నాగరిక మూలాలకు దూరమైంది. సాంస్కృతిక విస్మరణ కారణంగా భారతజాతి ఆత్మగౌరవాన్ని, స్వీయ అభిమానాన్నీ కోల్పోయింది. అలాంటి సంక్లిష్ట పరిస్థఇతిలో జాతి చైతన్యాన్ని జాగృతం చేసేందుకు, జాతీయ అస్తిత్వాన్ని స్పష్టంగా ప్రకటించేందుకూ ఎందరో మహానుభావులు ప్రయత్నించారు. అటువంటివారిలో రాజ్‌నారాయణ్ బసు ప్రముఖులు.
రాజ్‌నారాయణ్ బసు 1826 డిసెంబర్ 7న బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా బోరాల్ గ్రామంలో జన్మించారు. ఈ యేడాది ఆయన ద్విశత జయంతి సంవత్సరం. రాజ్‌నారాయణ్ విద్యాభ్యాసం పూర్తయాక సంస్కృత పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ సంఘ సంస్కరణకు తన జీవితాన్ని అంకితం చేసారు. పేదల అభ్యున్నతి, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళా విద్య, విధవా పునర్వివాహాలు వంటి రంగాల్లో గణనీయమైన కృషి చేసారు. స్వయంగా తన సోదరుడికి ఒక విధవతో వివాహం చేసి ఆదర్శంగా నిలిచారు.
ఆయన ఆనాటి విద్యావంతుల్లో జాతీయ చైతన్యాన్ని జాగృతం చేసేందు, తద్వారా వారిలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు అవిశ్రాంతంగా పనిచేసారు. అత్యవసరమైన ఆ గుణాలు లేకుండా ఏ జాతి అభ్యున్నతి అయినా సాధ్యం కాదని ఆయన అర్థం చేసుకున్నారు.
తన లక్ష్యాలను సాకారం చేయడానికి రాజ్‌నారాయణ్ ఒక ముసాయిదా తయారు చేసారు. దానిపేరు ‘జాతీయ భావన ప్రచార సమాజ ప్రకటన’. ఆయన నిరంతర ప్రయత్నాల ఫలితంగా నబగోపాల్ మిత్రా 1867లో ‘హిందూ మేళా’ అనే వేదికను ప్రారంభించారు. భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని ప్రోది చేసి, పెంపొందించేందుకు అదొక ప్రధానమైన వేదికగా నిలిచింది. హిందూ మేళా ద్వారా రాజ్‌నారాయణ్ బసు దేశీయ ఉత్పత్తుల వినియోగం గురించి, స్వదేశీ స్ఫూర్తి గురించి విస్తృతంగా ప్రచారం చేసారు.
రాజ్‌నారాయణ్ మాతృభాష ప్రాధాన్యతను ప్రముఖంగా చాటిచెప్పారు. ఒక జాతిలో చైతన్యం కలగడానికి, ఆత్మగౌరవ స్ఫూర్తి నెలకొనడానికీ మాతృభాష ముఖ్యమని ఆయన విశ్వసించారు. భారతదేశపు సాంస్కృతిక, జాతీయ ఐక్యతకు హిందూ ధర్మమే మూలమని ఆయన పరిగణించారు.
రాజ్‌నారాయణ్ 1873లో ‘ది సుపీరియారిటీ ఆఫ్ హిందూయిజం’ అనే గ్రంథం రచించారు. అందులో ఆయన హిందూ సంస్కృతిలోని విశేష లక్షణాలు, దాని పటిష్టమైన తాత్వికభూమిక గురించి వివరించారు. ఆ క్రమంలోనే ఆయన భారతదేశపు ‘జాతీయ చైతన్య పితామహుడి’గా కీర్తి ప్రఖ్యాతులు గడించారు. ‘మహా హిందూ సమితి’ జాతి జాగృతి, సాంస్కృతిక చైతన్యాలకు ప్రధానమైనదిగా దర్శించారు. ఆ ఆలోచననే సవిస్తరంగా సమగ్రంగా దర్శింపజేస్తూ ఆయన 1880లలో ‘వృద్ధ హిందూర్ ఆశా’ అనే పత్రాన్ని ప్రచురించారు.
ప్రముఖ యోగి, స్వాతంత్ర్య సమర యోధుడూ అయిన మహర్షి శ్రీ అరొబిందోకు రాజ్‌నారాయణ్ బసు మాతామహుడు. ఆయన ఆలోచనలు, జాతీయవాద దృక్పథం యువ అరొబిందో మీద గణనీయమైన ప్రభావం చూపాయి. భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ జాతీయ పునరుజ్జీవనం కోసమూ గొప్ప కృషి చేసిన రవీంద్రనాథ్ టాగోర్, స్వామి వివేకానంద, సోదరి నివేదిత వంటివారు ఆయనను అమితంగా గౌరవించారు. ఆయన జీవితం, ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందారు.
జాతి చైతన్య స్ఫూర్తి, గొప్ప దేశభక్తుడు, సంఘసంస్కర్త, దార్శనికుడు అయిన రాజ్‌నారాయణ్ బసు ద్విశత జయంతి సందర్భంగా ఆయనకు గౌరవపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాము. ఆయన ఆలోచనలు, ఆయన తాత్వికత నేటికీ సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయి. స్వీయ గౌరవం, మన సాంస్కృతిక వారసత్వం పట్ల అభిమానం, జాతి సమైక్యత ప్రాధాన్యతను నేటికీ మనకు గుర్తు చేస్తుంటాయి. భారతదేశం ఆయనకు శాశ్వతంగా ఋణపడి ఉంది.





