News

గిరిజన సంస్కృతి పరిరక్షణకు ట్రైబల్ ఎక్స్‌పీరియన్స్ పార్క్

34views

గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, స్థానిక సంస్కృతి పరిరక్షణతో పాటు యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే లక్ష్యంతో రెండు వినూత్న ప్రాజెక్టులను ప్రతిపాదించినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.

స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరం నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీతి ఆయోగ్ సూచించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, జిల్లాలో అభివృద్ధి సూచికల పురోగతి, నిర్దేశిత లక్ష్యాల సాధనపై సమీక్షించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, అభివృద్ధి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

గిరిజన సంస్కృతి పరిరక్షణకు ట్రైబల్ ఎక్స్‌పీరియన్స్ పార్క్
పోలవరం జిల్లాలో గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి, కళలు, జీవన విధానాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ‘ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఎక్స్‌పీరియన్స్ పార్క్ అండ్ మ్యూజియం’ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ వెల్లడించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా గిరిజన మ్యూజియం భవనం, ప్రదర్శన గ్యాలరీలు, బహిరంగ ప్రదర్శన ప్రదేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు.

గిరిజన యువత కోసం రంపచోడవరంలో ‘శిఖర్’ కేంద్రం
గిరిజన యువతలో శారీరక దృఢత్వం, క్రీడా నైపుణ్యాలు, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణ అందించేందుకు రంపచోడవరం కేంద్రంగా ‘శిఖర్’ (స్కిల్, హెల్త్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కైనటిక్స్ అండ్ అజిలిటీ రిసోర్స్ హబ్) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ ప్రాజెక్టు కింద ఆశ్రమ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు, 50 మంది బాలురు, 50 మంది బాలికలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. విద్యార్థుల కోసం డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, బయోమెట్రిక్ హాజరు, క్రీడా ప్రతిభను పర్యవేక్షించే వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కేంద్రం ద్వారా గిరిజన యువతకు క్రీడల్లో రాణించే అవకాశాలతో పాటు పోలీసు, సాయుధ దళాలు, అటవీశాఖ వంటి రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలు, శిక్షణ అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ వివరించారు.