
ఆచారాలు, సంప్రదాయాల పేరుతో వ్యక్తులను, కుటుంబాలను సామాజికంగా బహిష్కరించే అధికారం సంప్రదాయ గ్రామ వ్యవస్థలకు లేదని గౌహతి హైకోర్టు స్పష్టం చేసింది. నాగాలాండ్‌కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఏ కల్పించిన ప్రత్యేక రక్షణ ఉన్నప్పటికీ, దాని పేరుతో పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడం కుదరదని తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 21 కల్పించిన హక్కులకు భంగం కలిగించే ఏ నిర్ణయమైనా న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని జస్టిస్ యరెన్జుంగ్లా లొంగ్కుమెర్ ఈ నెల 10న వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు.
ఈ వివాదం నాగాలాండ్‌లోని మొకొక్చుంగ్ జిల్లా చంగ్టోంగ్యా ప్రాంతంలోని యవొంగ్యిమ్సెన్ గ్రామంలో ప్రారంభమైంది. గ్రామానికి చెందిన కొందరు చుమౌకెడిమా యావొంగ్యిమ్సెన్ పేరుతో యూనియన్ ఏర్పాటు చేసుకోగా, అది 1989లో ఏర్పడిందా? లేక 2001లో ఏర్పడిందా? అనే అంశంపై రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారం నాగా సంప్రదాయ సంస్థలైన యావొంగ్ యిమ్సెన్ పుటు మెండెన్, యావొంగయిమ్సెన్ సెన్సో ముంగ్డంగ్లకు చేరింది. విచారణ అనంతరం 2024 అక్టోబర్‌లో 42 మందిని గ్రామ బహిష్కరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 10న మరిన్ని ఆంక్షలు విధిస్తూ మహిళలు, చిన్నారులు సహా బాధిత కుటుంబాలు గ్రామంలోకి ప్రవేశించరాదని, గ్రామస్తులతో వివాహ సంబంధాలు పెట్టుకోరాదని ఆదేశించారు. అంతేకాకుండా వారి ధ్రువపత్రాల్లో గ్రామం పేరును తొలగించాలని కూడా సూచించారు.
ఈ నిర్ణయాలను సవాలు చేస్తూ బాధితులు గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సంప్రదాయ సంస్థల అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కు, ఆర్టికల్ 15 ప్రకారం వివక్ష నుంచి రక్షణ, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటాయని గుర్తుచేసింది. ఈ హక్కులను ఉల్లంఘించే విధంగా ఏ సంప్రదాయ సంస్థ కూడా నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసింది. వ్యక్తుల గౌరవప్రదమైన జీవనాన్ని దెబ్బతీసే సామాజిక బహిష్కరణ చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది.
ఇదే సమయంలో నాగాలాండ్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 371ఏ పరిధిని కూడా హైకోర్టు వివరించింది. నాగా మత, సామాజిక ఆచారాలు, సంప్రదాయ చట్టాలు, ఆచారాల ప్రకారం జరిగే న్యాయ నిర్వహణ, భూమి, వనరుల యాజమాన్యం వంటి అంశాలకు ఈ అధికరణ ప్రత్యేక రక్షణ కల్పిస్తుంది. అయితే ఈ రక్షణను ఉపయోగించుకుని పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేయడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సంప్రదాయ సంస్థలు సహజ న్యాయ సూత్రాలను పాటించాలని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది.
గతంలోనూ మహిళల రాజకీయ హక్కులు, గ్రామ కౌన్సిళ్ల నిర్ణయాల విషయంలో న్యాయస్థానాలు ఇదే తరహా వైఖరిని వ్యక్తం చేశాయి. నాగా మహిళల రాజకీయ ప్రాతినిధ్యం అంశంలోనూ సాంస్కృతిక సంప్రదాయాల పేరుతో హక్కులను నిరాకరించడంపై న్యాయపరమైన చర్చ జరిగింది. అలాగే 2023లో అత్యాచారం కేసు నిందితుడికి పదేళ్లపాటు గ్రామ బహిష్కరణ విధిస్తూ విలేజ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా గౌహతి హైకోర్టు కొట్టివేసింది. తాజా తీర్పు మరోసారి సంప్రదాయ వ్యవస్థల అధికారాలకు రాజ్యాంగం విధించిన పరిమితులను స్పష్టం చేసింది. ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించడం ఎంత ముఖ్యమో, వాటి పేరుతో పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.





