
సరిహద్దుల్లో మొన్న జరిగిన ఓ భీకర పోరాటం చదవాలి… తెలుగు పాఠకులు తెలుసుకోవాలి… కొన్ని జాతీయ పత్రికలు, సైట్లు కాస్త కవర్ చేశాయి గానీ మన తెలుగు చానెళ్లు, పత్రికలకు అస్సలు పట్టలేదు…
నిజానికి పాకిస్థాన్-ఇండియా సరిహద్దుల్లో సైనికులు ప్రతి క్షణమూ జీవన్మరణ పోరాటమేనని తెలుసు కదా… ప్రతిక్షణమూ టెన్షన్… ఒత్తిడి… ఎప్పుడూ అప్రమత్తగా ఉండి పహారా కాయాల్సిందే.. ఎప్పుడూ ఇరు పక్షాల నుంచి కాల్పులు జరుగుతూనే ఉంటాయి.
ఒకవైపు ఉగ్రవాదులు జొరబడుతూనే ఉంటారు…
కానీ మొన్న మూడు రోజుల క్రితం జరిగిన పోరాటం అనూహ్యం … ఓసారి చెప్పుకుందాం…
ప్రపంచంలోని దాదాపు ప్రతిదేశమూ ఇప్పుడు కరోనాపై పోరాటం చేస్తున్నది తెలుసు కదా? శతృదేశాల నడుమ కూడా, రోజూ విమానాల నుంచి బాంబులు కురిపించుకునే ఉద్రిక్తతలు కూడా సమసిపోయి, అందరూ కరోనాపై యుద్ధం చేస్తున్నారు… ఇప్పుడు జరగాల్సింది ఒక దేశానికి మరో దేశం సాయం చేసుకోవడమే… కానీ పాకిస్థానీ సైన్యం కథ వేరు. దానితో శిక్షణ పొందిన ఉగ్రవాదుల తత్వం వేరు. ఒకవైపు ప్రళయం ముంచెత్తుతున్నా సరే, ఇండియాలోకి జొరబడాలి, వీలైనంతమందిని చంపేయాలి… ఇదే లోకం… ఆ బుర్రలు అలా ట్యూన్ అయిపోయి ఉంటాయి… వాళ్ల బతుకులు అంతే.
కేరన్… ఇది ఓ చిన్న గ్రామం… పక్క రెండు దేశాల నడుమ, వాస్తవాధీన రేఖ వద్ద ఉంటుంది… పాక్ ఆక్రమిత కాశ్మీర్, కాశ్మీర్ నడుమ ప్రవహించే కృష్ణగంగ నది… ఈ కేరన్ ఉత్తర కాశ్మీరంలోని కుప్వారా జిల్లా పరిధిలోకి వస్తుంది… ఈ ఏరియాను మన సైన్యం కేరన్ సెక్టార్ అని పిలుస్తూ ఉంటుంది… ఇది చాలా సంక్లిష్టమైన, దుర్గమమైన ప్రాంతం… టఫ్ టెరేన్… కొండలు, గుట్టలు, లోయలు, నదీ ప్రవాహాలు. ఈ నెలలో కూడా మంచు కురుస్తూ ఉంటుంది. అసలు నడవడమే దుర్లభం… ఉగ్రవాదుల్ని ఎక్కువగా ఈ ప్రాంతం నుంచే పాకిస్థాన్ మన దేశంలోకి పంపిస్తూ ఉంటుంది… 1990 నుంచి ఎక్కువగా ఎన్ కౌంటర్లు జరిగిన స్థలం ఏదీ అంటే.. ఇదే.
సో, రక్షణపరంగా కీలకమైన ఏరియా…ఫ్లాష్ పాయింట్ అంటుంటారు మన సైనికాధికారులు… కొద్దికాలంగా అక్కడ సైన్యం కాపలాకు డ్రోన్లను, ఇజ్రాయిలీ థర్మల్ ఇమేజింగ్ రాడార్లను వాడుతున్నది… మొన్న ఒకటో తారీఖున అర్ధరాత్రి కేరన్ సెక్టార్ లో ఈ రాడార్లలో కొన్ని కదలికలు రికార్డయ్యాయి… పాకిస్థానీ సైన్యం , ఉగ్రవాదుల గురించి మనవాళ్లకు తెలుసు కదా? కరోనా కలకలం నడుమ వాళ్లేదో కుట్రకు తెరతీస్తారని అనుమానిస్తున్నదే.. అందుకే నిఘా ఎక్కువ చేశారు.
ఆ రాడార్ సూచిస్తున్న ఏరియాలో ఇన్ఫాంట్రీ యూనిట్ (8th Battalion of The JAT Regiment) సెర్చింగు స్టార్ట్ చేసింది… 2, 3 తేదీల్లో కూడా పెద్ద ఫలితం కనిపించలేదు… ఇలా కాదని సైన్యం (4th PARA SF) పారాచూట్ స్పెషల్ ఫోర్సును రంగంలోకి దింపింది… వీళ్లను డ్రాగర్స్ అంటారు….
చాపర్ ద్వారా ఇద్దరు కమాండోలు ప్లస్ ముగ్గురు పారాట్రూపర్లను ఆ ఉగ్రవాదుల్ని ట్రేస్ చేసిన ఏరియాలో దింపారు… మంచులో కొందరి పాదముద్రలు కనిపించాయి… ఉగ్రవాదులు జొరబడ్డారని కన్ఫరమ్ అయ్యింది…
ఇక వాళ్లను కనిపెట్టాలి… ఆ టఫ్ టెరేలో అంత వేగంగా ఎటూ దూరం తప్పించుకొని పోలేరు.. ఆ పాదముద్రల్ని అనుసరిస్తూ ఓ కొండ మీదకు చేరారు
కొండ మంచు మీద నిలబడ్డారు… ఎదురుగా మరో మంచుగుట్ట… నడుమ లోయ… థర్మల్ బైనాక్యులర్ తో చూస్తున్నారు… ఈలోపు ఆ కొండ అంచు విరిగిపడింది… ముగ్గురు లోయలోకి పడిపోయారు.
వీళ్లు ఎక్కడయితే పడ్డారో అక్కడే పాకిస్థానీ ఉగ్రవాదులు అయిదుగురు నక్కి ఉన్నారు….
ఈ హఠాత్ పరిణామానికి ఇటు సైనికులు, అటు ఉగ్రవాదులూ ఒక్కసారిగా బిత్తరపోయారు… చేతుల్లో అత్యాధునిక ఆయుధాల ఉన్నయ్.. కానీ ఒకరికొకరు క్లోజ్ రేంజులో ఉన్నారు… కాల్పులు జరిపే సీన్ లేదు.
పెద్దగా అరుస్తూ బాయినెట్లతో పొడుచుకుంటూ యుద్ధం స్టార్ట్ చేశారు… కింద ఏదో జరుగుతున్నదని ఇద్దరు సైనికులు కూడా లోయలోకి దూకారు. అయిదుగురు ఉగ్రవాదులు, అయిదుగురు జవాన్ల నడుమ ముఖాముఖి ఫైట్. తీవ్రంగా గాయాలు అవుతున్నా సరే, ఒక్క ఉగ్రవాదినీ వదిలిపెట్టేది లేదనే పట్టు… Hand to Hand Fight…
చివరకు ఆ అయిదుగురు ఉగ్రవాదులూ అక్కడిక్కడే చనిపోయారు… ముగ్గురు జవాన్లు కూడా అక్కడే చనిపోయారు… ఇద్దరు సైనికులు రక్తం కారుతూ, గాయాల నొప్పితో ఆ శవాల నడుమ కూర్చుని, ప్రాణాలు ఉగ్గబట్టుకుని సాయం కోసం ఎదురుచూడసాగారు…
సాయం కోసం వెళ్లిన వాళ్లకు అక్కడ కనిపించిన ఓ సీన్… ఒక టెర్రరిస్టు శవం మీద మన జవాను శవం ఒరిగిపోయి ఉంది… ఒళ్లంతా రక్తం గడ్డకట్టిన మరకలే… అంటే ఎలా ముఖాముఖి ఫైట్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు… ఆ ఇద్దరినీ వెంటనే శ్రీనగర్ లోని 92 Base Hospital తీసుకెళ్లారు… కానీ ప్రాణాలు దక్కలేదు… రెండు రోజుల తరువాత మరణించారు….
ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు దొరికాయి…లాక్ డౌన్ పీరియడ్ లో పెద్ద విధ్వంసమే ప్లాన్ చేశారు….అర్థమైంది కదా… పాకిస్థానీ సైన్యం మారదు… ఆ ఉగ్రవాదులూ మారరు.. వాళ్ళంతే…
సీన్ ఇలా ఉంటే…ఒకడేమో పది వేల వెంటిలేటర్లు ఇవ్వండి ప్లీజ్ అంటాడు ఇండియాను…. మరొకడేమో రెండు దేశాలూ క్రికెట్ ఆడి, డబ్బు సంపాదించాలంటాడు. ఒకసారి కేరన్ సెక్టారుకు తీసుకెళ్ళి పడెయ్యాలి వాళ్ళను.
SOURCE : MUCHATA.COM





