News

అయ్యప్ప స్వామి విగ్రహం ధ్వంసం..

9views

తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలోని శివాలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది.ఈ ఘటనతో అయ్యప్ప స్వామి భక్తులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల వివరాల ప్రకారం.. ఉదయం స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు, గ్రామస్థులు పరిషత్ ఎన్నికల హడావుడిలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విగ్రహం చేతులను విరగ్గొట్టడంతో పాటు ఆలయ ప్రాంగణంలోని పూజా సామగ్రిని చిందరవందరగా పడేశారు.

అంతేకాకుండా ఆలయ పరిసరాల్లో నువ్వులు చల్లి, ఆలయం చుట్టూ దారం కట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆలయ పవిత్రతను దెబ్బతీసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విగ్రహం ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.